రాజమౌళికి క్రిష్ కండిషన్... కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పండి... 'శాత‌క‌ర్ణి' ఎలా తీశానో చెబుతా!

మంగళవారం, 17 జనవరి 2017 (06:58 IST)
'బాహుబలి ది బిగినింగ్' చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెబితే 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని 79 రోజుల్లో ఎలా తీశానో చెబుతానని దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళికి శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ కండిషన్ పెట్టాడు. 
 
నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన ప్రతిష్టాత్మక 100వ చిత్రాన్ని కేవ‌లం 79 రోజుల్లో తీసి, అంద‌రి నుంచీ ద‌ర్శకుడు క్రిష్ ప్రశంసలు అందుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి కూడా ఎంత‌గానో అభినందించారు. ఓ కార్యక్రమంలో క్రిష్ మాట్లాడుతూ... ఈ సినిమా విడుద‌లైన అనంత‌రం త‌నతో రాజ‌మౌళి మాట్లాడుతూ 79 రోజుల్లో శాత‌క‌ర్ణిని ఎలా తీశావ‌ని అడిగారని, దానికి నేను ‘బాహుబ‌లిని క‌ట్టప్ప ఎందుకు చంపాడో చెప్పండి? చెబుతా’ అని స‌ర‌దాగా అన్నాన‌ని చెప్పారు.
 
అంద‌రూ త‌న‌ని ఈ విష‌య‌మే అడుగుతున్నార‌ని క్రిష్ అన్నారు. ఈ సినిమాకు ప‌నిచేసిన ఎడిట‌ర్ అద్భుతంగా తన పనితనాన్ని ప్రదర్శించారని అభినందించారు. ఈ సినిమాను తెరకెక్కించిన తీరు పట్ల నంద‌మూరి బాల‌కృష్ణ కూడా త‌న‌ను ఎంత‌గానో అభినందించార‌ని క్రిష్ అన్నారు. 
 
‘గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి’ చిత్రానికి కొన్ని చానెళ్లు, పేపర్లు ఫోర్ స్టార్ రేటింగులు ఇచ్చాయ‌ని, ఎంతో బాగుంద‌ని అంద‌రూ మెచ్చుకున్నార‌ని ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ సినిమా విజువ‌ల్ వండ‌ర్ గురించి ప‌లువురు ప్రముఖులు ప్రశంసించార‌ని, ఈ సినిమా కథ, రచన అన్ని అంశాల‌ను మెచ్చుకుంటున్నార‌ని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి