హీరో ధనుష్ మా కొడుకే.. పారిపోయాడు.. ధనుష్‌ కే రాజాగా మారిపోయాడు.. డబ్బులిప్పించండి..

శనివారం, 26 నవంబరు 2016 (14:02 IST)
ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడిగా పేరున్న హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు కొత్త సమస్య వచ్చిపడింది. మేలూరుకు చెందిన ఓ వృద్ధ దంపతులు ధనుష్ తమ కుమారుడేనని.. జన్మతః ధనుష్ తల్లిదండ్రులమని మేమేనని కోర్టును ఆశ్రయించడంతో ధనుష్ తలపట్టుకుని కూర్చున్నాడు.

కోలీవుడ్‌లో హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన ధనుష్‌ను తమ కుమారుడేనని మేలూర్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు వచ్చే ఏడాది జనవరి 12లోపు న్యాయస్థానం ముందుకు హాజరుకావాలని ధనుష్‌ను ఆదేశాలు జారీ చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, మేలూరు మనంపట్టి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులైన ఆర్‌ కథిరేసన్‌ (60), మీనాక్షి (55) కోర్టును ఆశ్రయించారు. 1985 నవంబర్‌ 7న ధనుష్‌ తమకు పుట్టాడని, అతని అసలు పేరు 'కాళీసెల్వన్‌' అని కోర్టుకు తెలిపారు. కథిరేసన్ దంపతులకు ధనుష్ పెద్ద కుమారుడని, వీరికి ఓ కూతురు కూడా ఉందన్నారు. ఆమె పేరు ధనపక్షియం అని వృద్ధ దంపతులు కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
అంతేగాకుండా ధనుష్ తమ కుమారుడు అనేందుకు తగిన ఆధారాలను కూడా వారు కోర్టులో సమర్పించారు. మేలూరులోనే తన కుమారుడు చదువుకున్నాడని.. 2002లో శివగంగై జిల్లాలోని అరుముగం పిళ్లై కాలేజీలో చేర్పించగా.. నటించాలనే కోరికతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడని, ఆ తర్వాత తన పేరు ధనుష్‌ కే రాజాగా మార్చుకున్నాడని రిటైర్డ్‌ ప్రైవేటు బస్సు కండక్టర్‌ అయిన కథిరేసన్‌ కోర్టుకు తెలిపారు. 
 
అనంతరం కస్తూరిరాజ సంరక్షణలో పెరుగుతూ హీరోగా ఎదిగాడని ఆయన చెప్పుకొచ్చారు. వృద్ధులైన తమకు ధనుష్‌ నుంచి నెలకు రూ. 65వేలు జీవనభృతిని ఇప్పించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి