ఆర్పీ పట్నాయక్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'మనలో ఒక్కడు' టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘల్ రామోజీరావు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి.జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్.రెడ్డి కథానాయికగా నటించారు.
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ రామోజీరావుగారి చేతుల మీదుగా టీజర్ విడుదల కావడం మా అదృష్టం. ఆయన టీజర్‌ని విడుదల చేయడమే కాకుండా మా యూనిట్ సభ్యుల్ని ఆశీర్వదించారు. ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ నెల 27వ తేదీన పాటల్ని విడుదల చేస్తాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ రామోజీరావు సమక్షంలో చిత్ర టీజర్ విడుదలైనందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను చాలా మంచి పాత్రలో నటించాను. తప్పకుండా అందరినీ అలరించడమే కాకుండా ఆలోచింపజేసే సినిమా అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు జెమిని సురేశ్, కెమెరామెన్ ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు ఉమేశ్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం, క్రియేటివ్ హెడ్ గౌతమ్ పట్నాయక్, గేయ రచయిత పులగం చిన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.