మేకప్ వేసుకుంటే మీరే కనిపిస్తారు.. అందుకే డూప్‌లు పెట్టి చేయలేను: చిరంజీవి

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (10:19 IST)
తాను మేకప్ వేసుకుంటే తనను తానే మరిచిపోతానిని, తన కళ్లముందు అంతా ప్రాణాలిచ్చే అభిమానులే కనిపిస్తారని, అందుకే సైరా నరసింహా రెడ్డి చిత్రంలో డూప్ లేకుండా చేశానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. 
 
ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, 'నా రక్తం పంచుకుపుట్టిన పవన్ కళ్యాణ్‌కు, నాకు రక్తం పంచి ఇచ్చిన అభిమానగణానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరిగ్గా 41 యేళ్ల క్రితం అంటే 1978 సెప్టెంబరు 22వ తేదీన నా జీవితంలో అద్భుతమైన రోజు. ఆ రోజున నా మొట్టమొదటి సినిమా 'ప్రాణం ఖరీదు' విడుదలైంది. ఆ రోజు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? నా భవిష్యత్‌ ఎలా ఉంటుంది? అనే మీమాంసలో ఉన్నాను. టెన్షన్‌... ఎగ్జయిట్‌మెంట్‌... ఏదో తెలియని ఉద్విగ్నత... రకరకాల ఫీలింగ్స్‌తో నేను నేల మీద లేనంటే ఒట్టు. అటువంటి ఉద్విగ్నత, టెన్షన్‌, ఎగ్జయిట్‌మెంట్‌ 41 సంవత్సరాల తర్వాత ఇపుడు అంటే ఈ 2019, సెప్టెంబర్‌ 22న ఫీలవుతున్నాను. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి... 'సైరా'. 'స్వాతంత్య్ర సమర యోధుడు పాత్ర చేయాలి. ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి. భగత్‌ సింగ్‌ లాంటివి చేయాలి' అని 22 ఏళ్ల క్రితం చెప్పాను. కానీ, ఎందుకో భగత్‌ సింగ్‌ కథను ఎవరూ నా ముందుకు తీసుకురాలేదు.
 
కానీ, సీనియర్ రచయితులుగా ఉన్న పరుచూరి బ్రదర్స్‌ ఉయ్యాలవాడ కథను తెచ్చారు. ఈ కథ విన్నప్పుడు, ఇది తెర మరుగు కాకూడదని మనసులో గట్టిగా అనిపించింది. కానీ, కథకు న్యాయం చేయాలంటే బడ్జెట్‌ ప్రాబ్లమ్‌. 10 - 15 యేళ్ళ క్రితం నా మీద రూ.30, రూ.40 కోట్లు పెట్టి సినిమాలు తీసే రోజుల్లో... 60, 70 కోట్ల రూపాయలతో సినిమా చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రాలేదు. ఇప్పుడు 151వ చిత్రంగా ఇది చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు శ్రీకారం చుట్టిందీ, పరోక్షంగా, సపోర్ట్‌ చేసిందీ దర్శకుడు రాజమౌళి. 
 
ఆయన గనుక 'బాహుబలి' తీసి ఉండకపోతే మనకు ఈ రోజు సైరా నరసింహారెడ్డి వచ్చేది కాదు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా... అంతకు అంత రాబట్టుకోవచ్చనీ, నిర్మాతకు నష్టం ఉండదనీ భరోసా కల్పించారు. తర్వాత రాంచరణ్‌ వచ్చి 'డాడీ... రిస్క్‌ ఉంటుంది. ఈ చిత్రాన్ని ఎవరికైనా అప్పచెప్పి... వాళ్లను మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? రాజీపడకుండా నేనే చేస్తా. మీరు రెడీయా?' అన్నాడు. నేను 'సై' అన్నాను. 
 
ఆ తర్వాత దర్శకుడు ఎవరైతే బాగుంటని ఆలోచన చేస్తుండగా, రామ్ చరణే దర్శకుడు సురేందర్‌ రెడ్డి పేరును ప్రస్తావించాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఓకే చెప్పడానికి 15 రోజుల సమయం తీసుకున్నాడు. ఏంటి సురేందర్ ఎందుకంత టైమ్ తీసుకున్నారు అని అడిగితే... ఏం చేయను సార్.. ఒకవైపు చిరంజీవి.. మరోవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ రెండింటికి న్యాయం చేయగలనా లేదా అన్న మీమాంస నుంచి బయటపడేందుకు ఆ సమయం తీసుకున్నా అని బదులిచ్చాడు. ఆ తర్వాత మూడు వారాలు గోవాకు వెళ్లిన సురేందర్ రెడ్డి బృందం వాస్తవగాథను వక్రీకరించకుండా, కమర్షియలైజ్‌ చేస్తూ స్క్రిప్టు సిద్ధం చేశారు. నాతో పాటు సన్నిహితులు కొందరు కథ విన్నారు. అందరూ బావుందన్నారు. కానీ, నాలో చిన్న ఆందోళన. ఈ పాత్ర చేయడం శారీరకంగా ఎంతో కష్టం. 
 
సినిమా అంతా గుర్రాల మీద స్వారి, కత్తియుద్ధాలు, ఒళ్ళు విరుచుకుని చేసే పోరాటాలు ఉంటాయి. నేనేమో డూప్‌తో చేయలేను. చేస్తే నా అభిమానులు ఒప్పుకోరు. నాకు ఏ కష్టం లేకుండా టెక్నాలజీతో తీస్తామన్నారు. కానీ, శారీరకంగా హింస పెట్టి యాక్షన్‌ సీక్వెన్స్‌లు రాబట్టారు. కానీ, ఏం చేసేది.? ఒక్కసారి మేకప్‌ వేసుకుని, కత్తి పట్టుకుని, గుర్రం ఎక్కానంటే... నా ఒళ్ళు మర్చిపోతాను. నా వయసు మర్చిపోతాను. అప్పుడు నాకు గుర్తొచ్చేది నా అభిమానులు, నా ఇమేజ్‌ మాత్రమే. 25 క్రితం ఏరకమైన జోష్‌తో చేశానో... అదే జోష్‌ మళ్ళీ నన్ను ఆవహిస్తుంది. యువతకూ కనెక్ట్‌ అయ్యే చిత్రమిది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు