ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 11గా నిర్మించిన చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్`. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు దర్శకునిగా పరిచయమవుతున్నారు. వెనిగళ్ళ ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా.... `మిడిల్ క్లాస్ మెలోడీస్` చిత్ర నిర్మాత వెనిగళ్ల ఆనందప్రసాద్ మాట్లాడుతూ ``సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. తొలి కాపీ కూడా సిద్ధంగా ఉంది. కథకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు తీద్దామనుకునే నిర్ణయంలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. గుంటూరు నేపథ్యంలో కథ సాగుతుంది. గుంటూరు జిల్లా కొలకలూరు ప్రాంతంలోనూ, గుంటూరు సిటీలోనూ... పరిసర ప్రాంతాల్లోనూ షూటింగు చేశాం. పాత్రలన్నీ గుంటూరు యాసలోనే మాట్లాడుతాయి. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ లాక్ డౌన్ పరిస్థితుల వల్ల విడుదలను వాయిదా వేశాం. త్వరలోనే విడుదల తేదీ వివరాలను వెల్లడిస్తాం’’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు వినోద్ అనంతోజు మాట్లాడుతూ "మామూలు మనుషుల జీవితాలలో ఉండే సున్నితమయిన హాస్యాన్ని ఇందులో చూపించాము. ప్రతి ఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా పాత్రలుంటాయి. వాటితో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. ఆనంద్ దేవరకొండ తొలి చిత్రం `దొరసాని`కి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది.’కేరాఫ్ కంచరపాలెం`తో పాటు పలు చిత్రాలకు సంగీతం అందించిన స్వీకర్ అగస్తి మా చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు. మొత్తం ఐదు పాటలున్నాయి`` అని అన్నారు.