మీరంటే ఎనలేని ప్రేమ - మీ పోరాటస్ఫూర్తి మాకు ఆదర్శం : మీ అభిమాని పవన్ కళ్యాణ్

ఆదివారం, 12 జులై 2020 (14:46 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకడంతో ప్రధానమంత్రి నుంచి సినీ సెలెబ్రిటీల వరకు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఆయన అమితాబ్‌ కరోనా వైరస్ సోకడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 
 
తామంతా అమితాబ్ బచ్చన్ అభిమానులమని పవన్ వెల్లడించారు. మీరంటే మాకెంతో ప్రేమ... అందుకు మీ ప్రతిభ ఒక్కటే కారణం కాదు.. మీ పోరాటస్ఫూర్తి, నిరాడంబరత, వినయవిధేయతలు కూడా కారణాలే అంటూ ట్వీట్ చేశారు.
 
"నాకిప్పటికీ గుర్తు. అప్పట్లో మీరు 'కూలీ' చిత్రం షూటింగ్ సందర్భంగా గాయపడితే మా కుటుంబం యావత్తు తల్లడిల్లిపోయింది. మా అమ్మ, నాన్నతో సహా ప్రతి ఒక్కరం మీ ఆరోగ్యం కోసం ప్రార్థించాం. అన్ని వయసుల వారి నుంచి మీరు ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు అందుకుంటున్నారు. 
 
కానీ.. మీరు, మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడ్డారని తెలియగానే ఎంతో బాధపడ్డాను. ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించాలని, మీరు, అభిషేక్ సంపూర్ణ ఆయురారోగ్యాలు సంతరించుకోవాలని ఆశిస్తున్నాను... ఇట్లు మీ అభిమాని పవన్ కల్యాణ్' అంటూ సందేశం వెలువరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు