ప్రతి ఒక్క దర్శకుడికి హాలీవుడ్ చిత్రం తీయాలన్న కల ఉంటుందని, దీనికి తాను కూడా అతీతుడిని కాదని దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. అందువల్ల హాలీవుడ్‌లో ప్రయోగం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
"ఆర్ఆర్ఆర్" చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది. అలాగే, మరో అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో హాలీవుడ్ దర్శక దిగ్గజం, "అవతార్" సృష్టికర్త జేమ్స్ కామెరూన్ సైతం "ఆర్ఆర్ఆర్" చిత్రాన్ని చూసి రాజమౌళిని మెచ్చుకున్నారు. దీంతో రాజమౌళి తదుపరి చిత్రం హాలీవుడ్‌లోనే ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని "ఆర్ఆర్ఆర్" టీమ్ స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, "భారత్‌కు తిరిగి చేరుకున్నాను. నేను ఒక డైరెక్టర్‌ను. ఒక సినిమాను ఎలా తీయాలో ఎవరూ నాతో చెప్పరు. బహుశా నా మొదటి అడుగు ముందుగా ఎవరో ఒకరి సహకారం తీసుకోవడం కావచ్చు" అని ఓ వార్తా సంస్థతో ఉన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన హాలీవుడ్ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చేవిగా ఉన్నాయని పేర్కొంటున్నాయి.