సినీరంగంలో ప్రవేశించి కొంత కాలమైనా కాలేదు. ఆ హీరోయిన్‌కు వరుస సినిమాలు దొరుకుతున్నాయి. దీంతో ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆమె తన రెమ్యునరేషన్‌ను పెంచేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా శ్రీవాస్ రూపొందిస్తోన్న చిత్రంలో నాయికగా పూజా హెగ్డే ఎంపికైనట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ మేఘన ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 21న లాంఛనంగా ప్రారంభమైంది.
జగపతిబాబు, రవికిషన, అశుతోష్ రాణా, మధు గురుస్వామి (కన్నడ నటుడు) ప్రతినాయకులుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ నాయిక ఎవరనేది సస్పెన్సగా ఉండింది. తాజాగా ఆ పాత్రను చేయడానికి పూజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటివరకూ ఏ సినిమాకూ తీసుకోనంత పారితోషికాన్ని ఈ సినిమాకు ఆమె అందుకోనున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.
ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 12 నుంచి పది రోజుల పాటు రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగనుంది. హీరో, విలన్లు, మరికొంతమంది ఆర్టిస్టులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. జూలై మొదటి వారం నుంచి నిర్వహించే రెండో షెడ్యూల్‌లో హీరోయిన పూజ సెట్స్‌పై అడుగుపెట్టనున్నారు. దర్శకుడిగా శ్రీవాస్‌కు ఇది ఆరవ చిత్రం ‘‘ఇప్పటివరకూ నేను చేయని భిన్నమైన తరహా కథతో ఈ సినిమా చేస్తున్నా. బెల్లంకొండ శ్రీనివాస్‌ను సరికొత్త రీతిలో చూపించబోతున్నా. దీనికి నేనే రచన చేస్తున్నా. చూసినవాళ్లంతా ‘వెల్‌మేడ్ మూవీ’ అంటారు’’ అని ఆయన చెప్పారు.