టాలీవుడ్ యువ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం "రాబిన్ హుడ్". ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన శ్రీలీల, కేతికశర్మలు హీరోయిన్లుగా నటించగా, ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది.
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్ర ప్రసాద్.. వార్నర్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనేక మంది నెటిజన్స్ రాజేంద్ర ప్రసాద్‌ను తిట్టిపోస్తున్నారు.
ఇందులో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, "హీరో నితిన్, దర్శకుడు వెంకీలు కలిసి ఈ వార్నర్‌ను పట్టుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ముం... కొడుకు.. వీడు మామూలోడు కాదండి.. రేయ్ వార్నర్.. నీకు ఇదే నా వార్నింగ్ అని అన్నారు.
అయితే, రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థంకాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు. రాజేంద్ర ప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడమేమిటని వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఈవెంట్‌లో శ్రీలీల, కేతిక శర్మలతో కలిసి డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేసి సందడి చేశారు.