అమెరికాలో రజినీకాంత్‌కు అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక.. ఆన్‌లైన్‌లోనే కబాలీ ఆడియో రిలీజ్!

శుక్రవారం, 10 జూన్ 2016 (09:43 IST)
తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురై.. ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈనెల 12వ తేదీన జరగాల్సిన 'కబాలీ' ఆడియో చిత్ర వేడుకను కూడా రద్దు చేసి... ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నారు. 
 
నిజానికి కబాలీ ఆడియో వేడుకను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్ణయించారు. ఇందుకోసం రజినీకాంత్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. 
 
అయితే ఉన్నపళంగా సదరు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన థాను నుంచి... ఆడియో రిలీజ్‌ను కేవలం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో విహార యాత్రకు వెళ్లిన రజినీ అనారోగ్యానికి గురయ్యారని, అక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడ్డాయి. 
 
రజనీకి అనారోగ్యం కారణంగానే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు నిర్మాత సన్నద్ధమయ్యారని ఆ వార్తా కథనాలు చెబుతున్నాయి. అయితే రజనీకి అనారోగ్యమంటూ వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కూడా మరికొన్ని కథనాలు చెబుతున్నాయి.
 
మరి ఇందులో నిజనిజాలేమిటో తెలియదు గాని రజనీకు సంబంధించిన ఈ వార్తలన్నీ అసత్యాలు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు . తమ అభిమాన హీరో సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించాలని కొందరు అభిమానులు ప్రార్థనలు కూడా చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి