కేజీఎఫ్ 2 సినిమాతో పాటు కాశ్మీరీ ఫైల్స్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 'కేజీఎఫ్ 2' చిత్రం బాలీవుడ్ లో చాలా మందికి నచ్చలేదని వర్మ అన్నారు. సినిమాను చూసిన ఓ బాలీవుడ్ బడా దర్శకుడు తనకు ఫోన్ చేశాడని... అరగంట సినిమా చూసే సరికి బోర్ కొట్టిందని చెప్పాడని తెలిపారు. అయితే వాళ్లకు తాను చెప్పేది ఒకటేనని... సినిమా నచ్చినా, నచ్చకపోయినా... అది సాధించిన ఘన విజయాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు.
వాస్తవికతకు దూరంగా ఒక అసహజమైన రీతిలో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడని తెలిపారు. రాఖీ బాయ్ మెషిన్ గన్ తో పేలిస్తే జీపులన్నీ గాల్లోకి ఎగురుతాయని... ఇది తనకు చాలా విడ్డూరంగా అనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పలేనని... అయితే కొన్ని సీన్లను మాత్రం నోరెళ్లబెట్టుకుని చూశానని అన్నారు.