ఉనికి కోసం రామ్ ప్ర‌య‌త్నం

శనివారం, 15 మే 2021 (13:22 IST)
Ram potineni
ఎనర్జిటిక్ హీరోగా ర‌వితేజ త‌ర్వాత అంత పేరు తెచ్చుకున్న న‌టుడు రామ్ పోతినేని. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ సోదరుడు మురళీ పోతినేని తనయుడే రామ్. అందుకే చిన్న‌త‌నంలోనే న‌ట‌న‌పై ఆస‌క్తి క‌లిగింది. 14 ఏళ్ళ‌కే ‘అదయాలం’ అనే తమిళ లఘు చిత్రంలో నటించేశాడు. 17వ యేట వై.వి.ఎస్. చౌదరి తెరకెక్కించిన ‘దేవదాస్’లో తొలిసారి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాలోనే తన  ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో జనానికి పరిచయం చేశాడు. దాంతో ‘ఎనర్జిటిక్ స్టార్’గా రామ్ నిలిచాడు. ఆయ‌న పుట్టిన‌రోజు మే 15. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు లింగుస్వామి, సంప‌త్ నంది, స‌మంతా అక్కినేని రామ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇంకోవైపు చిత్రా శుక్లా ప్ర‌ధాన పాత్ర‌పోషిస్తున్న `ఉనికి` టీమ్ కూడా రామ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.
 
2006లో `దేవ‌దాసు`గా ఇలియానాతో అల‌రించాడు. ఆ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన `జ‌గ‌డం` సినిమా ఆయ‌న వ‌య‌స్సుకు మించిన పాత్ర పోషించాడ‌నే విమ‌ర్శ తెచ్చుకున్నాడు. శ్రీ‌నువైట్లతో చేసిన `రెడీ` చిత్రం ఊహించ‌ని మ‌లుపు తిప్పింది. పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌వేలో ద‌ర్శ‌కుడు చూపించాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన `మ‌స్కా, పండుగ చేస్త్కో, రామ‌రామ‌కృష్ణ‌కృష్ణ‌, కందిరీగ చిత్రాలు ప‌ర్వాలేద‌నిపించాయి. అయితే మ‌ర‌లా రామ‌రామ‌కృష్ణ‌కృష్ణ కూడా మాస్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కించారు. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. కందిరీగ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఇవే కాకుండా ప్రేమ‌క‌థా చిత్రాలైన `నేను శైలజ‌, హ‌లోగురు ప్రేమ కోస‌మే చిత్రాలలో న‌టించి భిన్న‌మైన పాయింట్ చూపించాడు. ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్‌తో `ఎందుకంటే ప్రేమంటే` సినిమా చేశాడు. త‌మ‌న్నా నాయిక‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా త‌మ‌న్నా ఆత్మ‌గా మార‌డం, మ‌ర‌లా శ‌రీరంగంలో ప్ర‌వేశించ‌డం అనే స‌రికొత్త క‌థ జ‌నాల‌కు ఎందుక‌నో రుచించ‌లేదు. 
 
నేను శైల‌జ‌తో త‌న‌కు స‌క్సెస్ ఇచ్చిన కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలోనే ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ, రెడ్ సినిమాలు చేశాడు. ఇక పూరి జ‌గ‌న్నాథ్‌తో చేసిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం ఆయ‌న‌కు మంచి మైలురాయిగా నిలిచిపోయింది. మ‌ర‌లా అంత‌టి రేంజ్‌లో సినిమా చేయాల‌నుకున్నా సాధ్య‌ప‌డ‌లేదు. రెడ్ సినిమాలో రెండు పాత్ర‌లు పోషించి న‌ట‌న‌లో వ్య‌త్యాసాన్ని చూపించాడు. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ సినిమా చేయ‌డానికి కాస్త వ్య‌వ‌ధి తీసుకున్నాడు. ఈలోగా క‌రోనా కార‌ణంగా షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో త‌ను స‌రైన క‌థ కోసం వేచి చూస్తున్నాడు. `ఉనికి` నిర్మాణ‌సంస్థ ద్వారా స‌రికొత్త క‌థ‌తో ఆయ‌న ముందుకు రాబోతున్నాడ‌ని తెలుస్తోంది.  ఇప్ప‌టివ‌ర‌కు ఎన‌ర్జిటిక్ హీరోగా పేరుపొందిన ఆయ‌న ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత ఉస్తాద్ రాపోగా ప‌రిశ్ర‌మ‌లో పిలుచుకునే స్థాయికి వెళ్ళాడు. అందుకే త‌న ఉనికిని కాపాడుకునే క‌థ‌ల‌పైనే ఆయ‌న ఆస‌క్తి చూపుతున్నాడు. ఆయ‌న కోరిక నెవ‌రేరాల‌ని ఆశిద్దాం.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు