హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ... ఈ కేసులో డ్రగ్స్ కోణం ఉన్నట్టు కనిపెట్టింది. దీంతో డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ బ్యూరో రంగంలోకి దిగి... సుశాంత్ ప్రియురాలైన నటి రియా చక్రవర్తి, సుశాంత్ మేనేజరు, రియా సోదరుడుతోపాటు మొత్తం 13 మందిని విచారించగా డ్రగ్స్ డీలర్లతో బలమైన సంబంధాలు ఉన్నట్టు నిర్ధారించింది. ఆ తర్వాత వారందరినీ అరెస్టు చేసింది.
ఈ క్రమంలో రియా చక్రవర్తి బెయిల్ కోరుతూ పలు పర్యాయాలు కోర్టును ఆశ్రయించగా, అక్కడ తిరస్కరణకు గురయ్యారు. చివరకు బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం రాత్రి బైకులా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో నెలరోజుల తర్వాత ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చినట్టయింది.
దీనిపై ఆమె న్యాయవాది స్పందిస్తూ, నెలరోజులు జైలు జీవితం గడిపిన రియా ఇప్పుడు హాయిగా నిద్రిస్తారు అంటూ వ్యాఖ్యానించారు. సుశాంత్ మృతి వెనుక డ్రగ్స్ కోణం ఉందన్న నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో రియా చక్రవర్తిని పలుమార్లు విచారణకు పిలిపించిన ఎన్సీబీ అధికారులు ఆపై ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.