దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ రౌద్రం-రణం-రుధిరం. ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఈ సినిమా టైటిల్‌ను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకు రౌద్రం-రణం-రుధిరం అనే టైటిల్‌ను ఖరారు చేసింది. అలాగే, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'జలం అగ్నిని ఆర్పుతుంది. అదే అగ్ని జలాన్ని ఆవిరి చేస్తుంది. ఈ రెండు బలాలు కలిసి ఓ మహాశక్తిగా మీ ముందుకు వస్తున్నాయి' అంటూ దర్శకుడు రాజమౌళి ఈ సినిమా మోషన్ పోస్టర్ గురించి వ్యాఖ్యానించారు. కాగా, ఈ మోషన్ పోస్టర్‌లో హీరో ఎన్టీఆర్‌ను జలానికి, రాంచరణ్‌ను అగ్నికి ప్రతీకలా చూపించారు.
ఆర్.ఆర్.ఆర్ ఇంగ్లీష్ టైటిల్‌కు "రైజ్-రివోల్ట్-రోర్" అంటు క్యాప్షన్ పెట్టారు. రాజమౌళి శైలి ఎమోషన్, పవర్‌ఫుల్ ప్రజెంటేషన్‌తో మోషన్‌పోస్టర్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. తొలితరం స్వాత్రంత్య సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక పాత్రలకు కాల్పనిక అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇందులో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపించనుండగా, అలియాభట్, ఒలివియా మోర్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.