ఆమీర్ ఖాన్‌పై దేశద్రోహం కేసు.. హాజరుకావాలంటూ కాన్పూర్ కోర్టు సమన్లు

గురువారం, 26 నవంబరు 2015 (09:10 IST)
మత అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్‌పై దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల కేసులు నమోదవుతున్నాయి. ఇందులోభాగంగా ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కోర్టులో ఈ కేసు నమోదైంది. దీంతో డిసెంబర్ ఒకటో తేదీన నేరుగా కోర్టుకు హాజరుకావాలంటూ ఆయనకు కోర్టు సమన్లు జారీచేసింది. 
 
మరోవైపు ఆమీర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. కొంతమంది ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తుంటే మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐతే తనపై వస్తున్న విమర్శలకు ఆమీర్ ఖాన్ స్పందించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఒక భారతీయుడిగా గర్వపడుతున్నట్టు చెప్పారు. తనకు, తన భార్యకు దేశం విడిచి వెళ్లాలన్న ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. 
 
తన ఇంటర్వ్యూ చూడని వారే తనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. తన దేశ భక్తికి ఎవరి కితాబు అక్కర్లేదని ఆయన దెప్పిపొడిచారు. తాను అచ్చమైన భారతీయుడినని, దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని ఆమీర్ మరోసారి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి