ఇండియన్‌ సినిమా అంటే ఏంటి అనడిగితే బాహుబలి’ గురించే చెబుతా అంటున్న బాద్‌షా

ఆదివారం, 29 జనవరి 2017 (07:07 IST)
గ్లోబల్‌గా మన ఇండియన్‌ సినిమా స్థాయి ‘బాహుబలి’ లాంటి వాటి వల్ల పెరుగుతోందంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను అంటున్నారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. రాయిస్ సినిమా ఘన విజయం పొందుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన షారుక్ ప్రతి సినిమా ‘బాహుబలి’ తరహాలో ఉండాలనడంలేదు. భవిష్యత్‌ భారతీయ సినిమాలకు ‘బాహుబలి’ని ఓ రోడ్‌ మ్యాప్‌ కిందే భావిస్తాను అన్నారు. బాహుబలి అంటే తనకు ఎందుకంత క్రేజీనో ఆయన మాటల్లోనే విందాం. 
 
"పది రోజుల క్రితం ఓ వ్యక్తి ‘ఇండియన్‌ సినిమా అంటే ఏంటి’ అని నన్నడిగాడు. అప్పుడు నేను ఉదాహరణగా ‘బాహుబలి’ గురించి చెప్పా. ప్రతి సినిమా ‘బాహుబలి’ తరహాలో ఉండాలనడంలేదు. కానీ భవిష్యత్‌ భారతీయ సినిమాలకు ‘బాహుబలి’ని ఓ రోడ్‌ మ్యాప్‌ కింద నేను భావిస్తాను. ఈ సినిమాను నేను రెండుసార్లు చూశా. సెకండ్‌ పార్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా. 
 
నాతో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో నటిస్తున్న టైమ్‌లోనే సత్యరాజ్‌గారు ‘బాహుబలి’లో కట్టప్పగా నటిస్తున్నారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ రిలీజైంది. తర్వాత నేను ‘దిల్‌వాలే’ చేశా. అదీ రిలీజైంది. ఇప్పుడు ‘రయీస్‌’. సత్యరాజ్‌గారు మాత్రం ‘బాహుబలి’ చేస్తూనే ఉన్నారు. నటీనటులు, దర్శక–నిర్మాతలు, టెక్నీషియన్లు అంకితభావంతో ఆ సినిమా చేశారు. అందువల్లే, ఫలితం కూడా ఆ స్థాయిలో ఉంది. 
 
ఇటువంటి పాత్‌ బ్రేకింగ్‌ సినిమాలో నటించమని ఎవరైనా నన్ను అడిగితే తప్పకుండా నటిస్తా."
 
కట్టప్ప ‘బాహుబలి’ని ఎందుకు చంపాడో సత్యరాజ్‌‌ని అడిగాను కానీ ఆ సీక్రెట్‌ చెప్పమని అడిగితే నవ్వారు తప్పితే చెప్పలేదు అంటూ నవ్వారు షారుఖ్. 

వెబ్దునియా పై చదవండి