బిడ్డల్ని కనడానికి పెళ్లి చేసుకుంటానంటున్నారు నటి శ్రుతీహాసన్. విజయం అన్నది రాత్రికి రాత్రి వరించదు. ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుంది అంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న శ్రుతీహాసన్ విజయం వెనుక చాలా కష్టాలు ఉన్నాయట. అదేమిటీ ఆమె విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు కదా తనకు కష్టాలేమిటని ఆశ్చర్యపోతే పప్పులో కాలేసినట్లే... ఆ కష్టాలేంటో నటి శ్రుతీహాసన్ మాటల్లోనే చూద్దాం.
నా నట జీవితం 10 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఆరంభంలో నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో రాశిలేని నటిగా ముద్రవేశారు. అలా మూడేళ్లు కష్టపడ్డాను. ఆ సమయంలో నటుడు పవన్‌కల్యాణ్ ధైర్యం చేసి గబ్బర్‌సింగ్ చిత్రంలో తనకు జంటగా నటించే అవకాశం కల్పించారు. ఆ చిత్ర విజయంతో నా జీవితం మారిపోయింది. ఇప్పుడు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను.
నా తండ్రి కమలహాసన్‌ది దృఢమైన వ్యక్తిత్వం. కొన్ని నెలల క్రితం ఒక విపత్తుకు గురయ్యారు. కోలుకోవడానికి ఏడాదికి పైనే అవుతుందనుకున్నాం. అయితే చాలా త్వరగా రికవరీ అయ్యారు. అంత త్వరగా కోలుకోవడం ఇతరులకు సాధ్యం కాని పని. నాన్న ఒక నిర్ణయం తీసుకుంటే అది జరిగే వరకూ నిద్రపోరు. షూటింగ్ స్పాట్‌లో ఆయనతో నటించడం అంత సులభం కాదు. అందరూ తన మాదిరిగానే శ్రమించాలని ఆశిస్తారు. నేనూ నాన్నతో నటించడానికి చాలా భయపడ్డాను. ఆయన వేగాన్ని అందుకోవడం కష్టం. అయితే నటించడం మొదలెట్టిన తరువాత నేనూ నాన్నతో పాటు పరిగెత్తాల్సి వచ్చింది. శభాష్ నాయుడు చిత్ర తదుపరి షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నాం.
చాలా మందికి తెలియని విషయం ఒకటి చెప్పాలి. నా అసలు పేరు రాజ్యలక్ష్మి. అది మా నానమ్మ పేరు. నాకు సంగీతంపై ఆసక్తి వల్ల శ్రుతి అని పిలిచేవారు. ఆ తరువాత అదే నామధేయంగా మారిపోయింది. భవిష్యత్తులో పలు సంగీత ఆల్బమ్‌లు రూపొందిస్తాను. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంటడం వల్ల నక్షత్ర హోటళ్లు, మిమానయానాలంటూ జీవితం సాగిపోతోంది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. బిడ్డల్ని కనడానికైనా పెళ్లి చేసుకుంటాను అంటున్న శ్రుతీ తన సినీ కేరీర్‌ను మలుపు తిప్పిన నటుడు పవన్‌కల్యాణ్‌కు జంటగా మరోసారి కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నారు.