కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ యాంకర్‌గా తన కెరియర్‌ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి.. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల విడుదలైన శివ కొత్త సినిమా 'రెమో' డివైడ్‌టాక్‌తో మొదలైనప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. నిజానికి రెమో ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గర నుంచి మాంచి క్రేజును సొంతం చేసుకుంది. ట్రైలర్ విడుదలై యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ లేడీ గెటప్‌లో వెరైటీగా నటించాడు. ఈ హీరో సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించింది. వీరిద్దరు కలిసి నటించిన సీన్లన్నీ బాగానే పండాయి. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో...చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్లో థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర బృందం.
ఈ కార్యక్రమంలో హీరో శివ కార్తికేయన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సినిమాను అడ్డుకోవడానికి తమిళనాట చాలా ప్రయత్నాలు జరిగాయట. రిలీజ్ విషయంలో.. అంతకుముందు చాలా ఇబ్బందులు పెట్టారట. ఓ దశలో మాటలు రాక ఆగిపోయాడు. తల వంచుకుని ఏడ్చేశాడు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగిస్తూ తమ సినిమాను అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని.. అలా ఎవరు చేశారో తనకు తెలుసని.. దయచేసి కష్టపడి పని చేస్తున్న తమకు అడ్డు తగలవద్దని శివ వేడుకున్నాడు.
పని చేసుకునేవాళ్లు పని చేసుకోనివ్వాలని కోరాడు. తాను ఎంత కష్టపడి పైకి వచ్చానో అందరికీ తెలుసని.. ఐతే ఇంతకుమించి ఎక్కడికో ఎదిగిపోవాలని తనకు లేదని.. తనకు కట్టబెట్టిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికే తాను ప్రయత్నిస్తున్నానని అన్నాడు. కాగా 'రెమో' చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు అనువదించి రిలీజ్ చేయబోతుండటం విశేషం. ఇప్పుడు తమిళ చిత్ర వర్గాల్లో శివ కార్తికేయన్ వ్యాఖ్యలు చర్చనీయంగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు.