ఈ జన్మకిది చాలు బాబో అన్నంతగా రాజమౌళికే పులకరింపు కలిగించిన బాహుబలి2 వీడియో ట్రైలర్ రోజురోజుకీ చరిత్ర సృష్టిస్తూనే ఉంది. వారం రోజులక్రితం యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్ 100 మిలియన్‌లకు (పది కోట్లు) పైగా వ్యూస్‌ను సాధించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కాదు ప్రపంచ చలనచిత్ర చరిత్రలో కూడా అనితర సాధ్యమైన ఫీట్ సాధించిన బాహుబలి ట్రయిలర్ రికార్డును సమీప భవిష్యత్తులో ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదని చిత్ర పరిశ్రమ పండితులు, విశ్లేషకులు ముక్తకంఠంతో శ్లాఘిస్తున్నారు.
ఇక చిత్ర దర్శకుడు రాజమౌళి అయితే ఆనందం అంబరమంటిన స్థాయిలో ఉప్పొంగిపోతున్నారు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ స్థాయిలో ట్రైలర్ చూస్తారని అసలు ఊహించలేదని.. అభిమానులు దీన్ని సాధ్యం చేశారని ట్వీట్ చేశారు. ఆన్‌లైన్‌లో అత్యధికులు వీక్షించిన ట్రైలర్‌గా రికార్డులు సృష్టించిన 'బాహుబలి-2'.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ 26న సాయంత్ర ఆరున్నర గంటలకు 360 డిగ్రీస్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించనున్నట్లు రాజమౌళి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 4k రిజల్యూషన్‌తో అభిమానులకు అందుబాటులోకి తీసుకొస్తుంది మూవీ యూనిట్. మరోవైపు దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతుంది. తొలిసారిగా ఓ సినిమా భారత్‌లో ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే ప్రథమం.
ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.