ఇటీవల కుప్పంలో తీవ్ర అస్వస్థతకులోనై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి ఓ వైద్య బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు స్పష్టంచేసింది. అయితే, తారకరత్నకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఆయనకు ఇప్పటివరకు ఎక్మో సపోర్ట్ అందించలేదని వివరించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికపుడు అభిమానులకు సమాచారం అందిస్తున్నారని, తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ప్రజలెవరూ తారకరత్నను చూసేందుకు రావొద్దని, చికిత్సకు అంతరాయం కలగకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
కాగా, ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇందులో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో తొలుత ఆయన్ను కుప్పంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత అక్కడ నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.