తొలిప్రేమ రీ-రిలీజ్ వసూళ్లు జనసేన రైతు భరోసా యాత్రకు విరాళం
శనివారం, 24 జూన్ 2023 (16:37 IST)
Raghuram Reddy, Ravikant Reddy, Karunakaran, GVG Raju, Vasuki, Ananda Sai
తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో 'తొలిప్రేమ' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ఒకటిగా 'తొలిప్రేమ' ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ వెండితెర మీద చూసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.
'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4k లో విడుదల చేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం జూన్ 30న 300 కి పైగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ వేడుక శనివారం ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "తొలిప్రేమ అనేది ఒక గొప్ప జ్ఞాపకం. ఇందులో భాగమైన పవన్ కళ్యాణ్ గారికి, కరుణాకరన్ గారికి, జి.వి.జి.రాజు గారికి అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం ఈ చిత్రం. నా సినీ ప్రయాణంలో తొలిప్రేమకి అంటూ ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా అప్పుడప్పుడే నా ప్రయాణం మొదలైంది. ఒకసారి రవీందర్ రెడ్డి అనే ఒక ఫైనాన్సియర్ నాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఒక కొత్త కుర్రాడితో జి.వి.జి.రాజు నిర్మాణంలో సినిమా చేయబోతున్నారని చెప్పారు. ఇదే నాకు తెలిసిన సమాచారం. నేను కొన్ని లెక్కలేసుకొని సినిమా ఓపెనింగ్ కి వెళ్ళాను. అప్పటికి నాకు చెప్పుకోడానికి కూడా ఏంలేదు. ఒక్క పెళ్లిపందిరి మాత్రమే చేశా. జి.వి.జి.రాజు గారిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకొని డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగాను. పూజ అయిపోయాక, ఒకసారి కలవమంటే వెళ్లి కలిశాను. అలా ఒక్క సిట్టింగ్ లోనే సినిమా కొనడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాతో నాకు ప్రయాణం మొదలైంది. నేను నిర్మాతగా ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినా, నా మనసులో ఎప్పటికీ తొలిప్రేమకి ప్రత్యేక స్థానముంటుంది. సినిమా ప్రివ్యూ నుంచి వంద రోజుల ఫంక్షన్ వరకు ఎన్నో జ్ఞాపకాలు. వంద రోజుల ఫంక్షన్ రోజు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. అయినా ఫంక్షన్ కి కంట్రోల్ చేయలేనంతగా క్రౌడ్ వచ్చారు. ఒక చరిత్ర ఇది. అలాంటిది నేను మళ్ళీ చూడలేదు. ఇలా ఎన్నో చరిత్రలు సృష్టించిన సినిమా తొలిప్రేమ. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఎప్పుడు తక్కువున్నా ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాణ్ణి. ఏదైనా ఫ్లాప్ వస్తే, ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం కోసం ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాణ్ణి. అలా మళ్ళీ మూడుసార్లు రిలీజ్ చేశాం. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నాకు అడుగులు నేర్పించిన సినిమా తొలిప్రేమ. అలాంటి తొలిప్రేమలో నేను భాగమైనందుకు ఎప్పటికీ గర్వపడతాను. ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది. 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమా జూన్ 30న మన ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ మరోసారి థియేటర్ కి వెళ్లి ఈ సినిమా ఇచ్చే అనుభూతిని పొందండి. రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్" అన్నారు.
దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. "వర్షం భూమ్మీద ఎక్కడైనా పడొచ్చు. కానీ సరైన చోటులో పడితేనే ఆ వాన చినుకులకు విలువ వస్తుంది. నా కథ అనేది కళ్యాణ్ గారి చేతిలో పడింది. అందువల్లే ఇంత పెద్ద హిట్ అయింది. నిర్మాత జి.వి.జి.రాజు గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నాను. ఈ ఒక్క చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. నేను ఎప్పుడు ఎక్కడికెళ్లినా నా అమ్మనాన్న పవన్ కళ్యాణ్ అని చెబుతుంటాను. నా అన్నయ్య పవన్ కళ్యాణ్ వల్లే ఇంత పెద్ద హిట్ ఇవ్వడం జరిగింది. నా అన్నయ్యకి ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను" అన్నారు.
చిత్ర నిర్మాత జి.వి.జి.రాజు మాట్లాడుతూ.. "తొలిప్రేమ విడుదలై 25 ఏళ్ళు అవుతుంది. 'Great pictures are not made, they happen' అంటారు. కరుణాకరన్ గారు, ఆనంద్ సాయి గారు, దేవా గారు, చింతపల్లి రమణ గారు, మార్తాండ్ వెంకటేష్ గారు ఇలా అందరం ఈ గొప్ప చిత్రంలో భాగమై ఎంతో పేరు తెచ్చుకున్నాం. డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఈ చిత్రంతోనే తొలి అడుగులు వేసి, ఈస్థాయికి చేరుకున్నారు. తొలిప్రేమ సినిమా ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా సమయంలోనే ఆనంద్ సాయి గారు, వాసుకి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే కొడైకెనాల్ ఇంటర్వెల్ సీన్ షూటింగ్ సమయంలో మేల్ డూప్, ఫిమేల్ డూప్ కి గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో వారు కూడా ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. ఇలా తొలిప్రేమ సినిమా ఎన్నో నిజ ప్రేమ కథలకు కారణమైంది. ఈ సినిమాకి రీరిలీజ్ చేస్తున్న రఘురాం రెడ్డి గారికి, రవికాంత్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్" అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి మాట్లాడుతూ.. "ముందుగా నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కృతఙ్ఞతలు తెలపాలి. ఈ సినిమాతోనే నా ప్రయాణం మొదలైంది. అప్పటికి నాకు ఆర్ట్ డైరెక్షన్ గురించి పెద్దగా తెలీదు. కానీ నువ్వు చేయగలవని కళ్యాణ్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆరోజు కళ్యాణ్ గారు ఆ ఫ్లాట్ ఫామ్ ఇవ్వడం వల్లే, ఈరోజు నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను. కళ్యాణ్ గారు లేకపోతే నేను గానీ, కరుణాకరన్ గారు గానీ ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ముందుగా వేరే పెద్ద ఆర్ట్ డైరెక్టర్ ని అనుకున్నప్పటికీ, నాకు ఈ అవకాశమిచ్చి కరుణాకరన్ గారు, జి.వి.జి.రాజు గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్ వచ్చి తాజ్ మహల్ సెట్ వేయడం అంత తేలిక కాదు. నేను చేయగలనని నమ్మి అవకాశమిచ్చారు. ఈ సినిమా వల్లే నా కెరీర్ ఇంత బాగుంది. అలాగే వాసుకి కూడా నా జీవితంలోకి వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే సినిమాటోగ్రాఫర్ మహీధర్ గారు దూరమయ్యారు. అశోక్ గారు, నగేష్ గారు వీరంతా మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా" అన్నారు.
నటి వాసుకి మాట్లాడుతూ.. "తొలిప్రేమ విడుదలైన సమయంలో నేను ఇక్కడ లేను, చెన్నైలో ఉన్నాను. కానీ ఇప్పుడు రీరిలీజ్ సమయంలో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా అరుదైన అవకాశం. ఈ సినిమా రీరిలీజ్ అవుతుండటం, నేను హైదరాబాద్ లోనే ఉండటం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను" అన్నారు.
ప్రముఖ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. "పాతికేళ్ల క్రితం వచ్చిన తొలిప్రేమ ట్రైలర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారో, ఇప్పుడు మేం నిర్మిస్తున్న 'బ్రో'లో కూడా అలాగే ఉన్నారు. ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈమధ్య అన్ని రీరిలీజ్ లు ఒక పండుగ లాగా ఉంటున్నాయి. ఇలా రీరిలీజ్ లు సినిమాలకు ఫంక్షన్లు చేయడం ఓ కొత్త ఒరవడి. ఇలా చేయడం చాలా బాగుంది. ఈ సందర్భంగా కరుణాకరన్ గారికి, జి.వి.జి.రాజు గారికి, ఆనంద్ సాయి గారికి, వాసుకి గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను" అన్నారు.
జనసేన రైతు భరోసా యాత్రకు విరాళం:
శ్రీ మాతా క్రియేషన్స్ నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమాని రీరిలీజ్ చేయడానికి కారణం.. అభిమానిగా ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. ఈ సినిమాని రీరిలీజ్ చేసే అవకాశాన్ని కల్పించిన జి.వి.జి.రాజు గారికి ధన్యవాదాలు. జూన్ 30 న ఈ సినిమాని భారీగా రీరిలీజ్ చేస్తున్నాం. అందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొత్త మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తలపెట్టిన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం" అన్నారు.