బరువు తగ్గడానికి తీసుకున్న చికిత్సే దాసరి ప్రాణాలు తీసింది: రేలంగి

శనివారం, 1 జులై 2017 (09:45 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల సీనియర్ డైరక్టర్ రేలంగి నరసింహారావు స్పందించారు. బరువు తగ్గేందుకు తీసుకున్న చికిత్సే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానికి కారణమైందని రేలంగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చికిత్స చేసుకోకపోయి వుంటే దాసరి మరో పదేళ్లు జీవించి వుండేవారని రేలంగి అన్నారు.

యూట్యూబ్ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేలంగి మాట్లాడుతూ.. బరువు తగ్గించుకునే చికిత్సలో భాగంగా దాసరిగారు తొలుత జీర్ణాశయంలో బెలూన్ వేయించుకున్నారన్నారు. ఆపై ఆరేడు కిలోల బరువు తగ్గారని వెల్లడించారు. అదే నమ్మకంతోనే రెండోసారి దీనిపై కూడా సర్జరీకి వెళ్లి..బెలూన్‌ వేయించుకోవడమే ఆయన ప్రాణం తీసిందని తెలిపారు. రెండోసారి సర్జరీకి వెళ్లడమే దాసరి చేసిన తప్పు అని రేలంగి పేర్కొన్నారు. 
 
దాసరికి రెండోసారి పొట్టలో బెలూన్ వేసేటప్పుడే లోపం తలెత్తితే వైద్యులు దానిని సవరించి ఇంటికి పంపించారని అన్నారు. మొదటిసారి చికిత్స తీసుకున్నప్పుడు ఆయన ఎక్కువ ద్రవాహారన్నే తీసుకున్నారని తెలిపారు.

కానీ, రెండోసారి బెలూన్ వేయించుకునేందుకు వెళ్లినప్పుడు మాత్రం నోటి ద్వారా సాధారణ ఆహారాన్ని తీసుకునేందుకు చికిత్స చేయించుకున్నారన్నారు. అదే ఆయన ప్రాణానికి ముప్పు తెచ్చిందని వెల్లడించారు. సర్జరీకి వెళ్లకుండా ద్రవాహారాన్నే ఆయన తీసుకుని ఉంటే మరో పదేళ్లు బతికేవారని రేలంగి వివరించారు.

వెబ్దునియా పై చదవండి