ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు సినిమాలకు చెందిన పోస్టర్లు సోషల్ మీడియాలో శరవేగంగా విడుదలయ్యాయి. పెద్దల హీరోల నుంచి యంగ్ హీరోల వరకు భారీ బడ్జెట్ మూవీల నుంచి స్మాల్ బడ్జెట్ మూవీల వరకు గల సినిమాల పోస్టర్లు నెట్లో హలచల్ చేస్తున్నాయి. టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు-మురుగదాస్ కాంబోలో వస్తున్న కొత్త సినిమాలో మహేష్ లుక్ విడుదలైంది.
అలాగే వెంకీ నటిస్తున్న గురు సినిమా పోస్టర్లను కూడా యూనిట్ విడుదల చేసింది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ టాలీవుడ్ సినిమాలకు చెందిన సినీ పోస్టర్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం అభిమానులు ఉగాదితో పాటు డబుల్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ సోషల్ మీడియాలో ఏయే సినిమాలకు చెందిన పోస్టర్లు రిలీజ్ అయ్యాయే చూద్దాం..
పూరీ దర్శకత్వంలోని రోగ్ సినిమా పోస్టర్లతో పాటు మంచు విష్ణు కొత్త చిత్రం ఆచారి అమెరికా యాత్ర సినిమాకు చెందిన పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఇంకా యంగ్ హీరో రాజ్ తరుణ్ అంధగాడు పోస్టర్ నెట్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినిమా పోస్టర్ నెట్లో భారీగా వైరల్ అయ్యింది. రారండోయ్ వేడుక చూద్దాం.. అనే టైటిల్‌తో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమా పోస్టర్ ఫ్యాన్స్‌కు ఉగాది ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ పోస్టర్లలో చైతూ స్మార్ట్‌గా హైట్‌గా కనిపించడం.. రకుల్ బ్యాండ్ వాయిస్తూ కనిపించింది. తద్వారా ఈ పోస్టర్లకు మంచి క్రేజ్ వస్తోంది. ఇక కార్తీక్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చెలియా సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. సినిమాలకు బాగా గ్యాప్ తీసుకున్న గోపిచంద్ కూడా గౌతమ్‌నంద పోస్టర్‌తో ప్రేక్షకులను పలకరించాడు.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు ఉగాదికి ముందుగా రిలీజైనా.. బంపర్ హిట్ కావడంతో కొత్త పోస్టర్లతో ఫ్యాన్స్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు విడుదల చేశారు. ఇదేవిధంగా కథలో రాజకుమారి, కేశవ, లంక, నక్షత్రం, నీది నాది ఒకే కథ, రామ్ కొత్త సినిమా పోస్టర్, వైశాఖం, వెంకటాపురం వంటి చిన్న బడ్జెట్ మూవీల పోస్టర్లు సోషల్ మీడియాలో కళకళలాడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. మిస్టర్ సినిమా పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగా హీరో వరుణ్ తేజ్, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ సినిమా పోస్టర్లో ముగ్గురూ అందంగా కనిపించి.. మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు.