దేవరాజ్‌ను శ్రావణి ఎందుకు దూరం పెట్టింది?

గురువారం, 10 సెప్టెంబరు 2020 (09:59 IST)
తాను మనస్ఫూర్తిగా ఇష్టపడటమే కాదు.. ఏకంగా తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించిన దేవరాజ్ రెడ్డి కారణంగానే బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శ్రావణి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు రావాల్సిందిగా దేవరాజ్‌కు పోలీసులు సమాచారం పంపించారు. అసలు ఎంతో ఇష్టపడిన దేవరాజ్‌ను శ్రావణి ఎందుకు దూరం పెట్టిందనే విషయాన్ని పరిశీలిస్తే... 
 
టిక్‌‌టాక్‌ ద్వారా ఏపీలోని కాకినాడకు చెందిన దేవరాజ్‌ రెడ్డి అలియాస్‌ సన్నీతో శ్రావణితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనకు వెనకా ముందు ఎవరూ లేరని, ఆశ్రయం కల్పిస్తే ఏదైనా పనిచేసుకుంటానని అతను కోరడంతో శ్రావణి తల్లిదండ్రులు అంగీకరించారు. గత సంవత్సరం సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి దేవరాజ్‌ శ్రావణి ఇంట్లోనే ఉండసాగాడు. 
 
ఒకవైపు, శ్రావణితో ఒకవైపు బాగా ఉంటూనే దేవరాజ్‌ రెడ్డి ప్రేమపేరుతో మరో యువతిని మోసం చేశాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న శ్రావణి, ఎలాగైనా అతడిని దూరంగా పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో అతడు శ్రావణిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను బూచిగా చూపి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వస్తున్నాడు. 
 
శ్రావణి ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుల వద్ద ఉంటున్న దేవరాజ్‌.. ఆమెకు ఫోన్‌ చేసి డబ్బులు పంపించాలని బెదిరించడంతో గూగుల్‌ పే ద్వారా ఒకసారి రూ.30 వేలు పంపింది. గత ఫిబ్రవరి 25వ తేదీన శ్రావణి ఇంటికి వచ్చిన దేవరాజ్‌ అత్యాచార యత్నానికి పాల్పడటంతో ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. 
 
రెండు రోజుల అనంతరం ఫోన్‌ చేసి తనకు లక్ష రూపాయలు కావాలని డిమాండ్‌ చేయటంతో మొదట రూ.60 వేలు, ఆ తర్వాత మరో రూ.40 వేలు పంపించింది. కాగా, దేవరాజ్‌రెడ్డి వేధింపులు అధికం కావడంతో ఈ ఏడాది జూన్‌ 22న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. 
 
దీంతో పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దేవరాజ్‌ను పట్టుకోవడానికి గతంలో కాకినాడకు కూడా వెళ్లారు. ఇంతలోనే శ్రావణి తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో దేవరాజ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదు. 
 
ఆ తర్వాత కూడా దేవరాజ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. శ్రావణిని వేధించసాగాడు. తనకు డబ్బు అవసరమైనపుడల్లా శ్రావణికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజుకోసాగాడు. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువ కావడంతో వాటిని భరించలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు