గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాలల్లో డ్రగ్స్ చుట్టూ కథ నడుస్తూ అనేకమంది సెలబ్రిటీలను విచారణకు హాజరయ్యేలా చేసింది. మరీ ముఖ్యంగా పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, ఛార్మీ, కెమెరామేన్ శ్యామ్.కె.నాయుడు, నటుడు రవితేజ, నవదీప్ తదితరులు ఇందులో ఉండటం విశేషం. అందులో పూరీ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తన సినిమాలకు కథ రాసేందుకు, చిత్రీకరణకు, పాటల చిత్రీకరణకు ఇలా అన్నీ సౌలభ్యాల కోసం "బ్యాంకాక్"ని కేంద్రంగా చేసుకున్నారు.
తన సినిమాలైన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు, నేనింతే, ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్‌మేన్, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుకున్నాయి. అందులోనూ ఆ దేశంలో కార్పొరేటర్‌గా తాను నిలబడితే తప్పక గెలుపొందుతానని తానే స్వయంగా ఎన్నో సందర్భాల్లో బాహాటంగా చెప్పారు.
ఆ దేశంలో యథేచ్ఛగా మత్తు పదార్థాలను తయారుచేయడం, వాటి ఎగుమతికి కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇక మసాజ్ సెంటర్లు గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి దేశంలో మన స్టార్లు షూటింగ్‌ల పేరుతో అక్కడికి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అలాగే హీరో నవదీప్ సైతం ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో వచ్చే రియాల్టీ షో కోసం బ్యాంకాక్‌నే ఎంచుకోవడంలో పరమార్థమేమిటో జనాలకు ఇట్టే అర్థమౌతుంది.
ఇంత పెద్ద భారతదేశంలో అనేక ప్రాంతాలు ప్రకృతి అందాలను తనలో కలిగి ఉంది. కానీ మన దర్శకులు ఇక్కడ షూటింగ్‌లకు ఇష్టపడరు. అందుకే "పొరిగింటి పుల్లకూర రుచి ఎక్కువని" మన పెద్దవాళ్లు ఊరకే అనలేదు. ఇకనైనా మన దేశంలో షూటింగ్‌లు జరిపి, ఆయా ప్రాంతాలను అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా నిర్మాతలకు ఖర్చు తగ్గించేలా సినిమాలు తీస్తారని ఆశిద్దాం.