వర్సిటీలలో అన్నమయ్య సాహితీ సదస్సులు

శుక్రవారం, 23 జనవరి 2009 (13:14 IST)
రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలలో అన్నమయ్య సాహితీ సదస్సుల నిర్వహణకు అన్నమాచార్య ప్రాజెక్టు సన్నాహాలు ప్రారంభించింది. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో శుక్రవారం ఈ సదస్సులకు శ్రీకారం చుట్టునున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో రమణాచారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ విషయమై అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ మేడసాని మోహన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... వేదాలు, ఉపనిషత్తులు, ఆగమ శాస్త్రాలు, పురాణేతిహాసాల సారాన్ని తన కృతులలో ప్రతిపాదించిన అన్నమయ్య తిరుమలేశునికి కీర్తిగానం చేశాడని పేర్కొన్నారు. ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ సాహితీ సదస్సులను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తరువాత.. ఉస్మానియా (హైదరాబాద్), శాతవాహన (కరీంనగర్), తెలంగాణ (నిజామాబాద్), కాకతీయ (వరంగల్), పాలమూరు (మహబూబ్‌నగర్), అంబేద్కర్ (శ్రీకాకుళం), ఆంధ్రా (విశాఖపట్టణం), ఆది కవి నన్నయ (రాజమండ్రి), కృష్ణా (విజయవాడ), నాగార్జున (గుంటూరు), విక్రమ సింహపురి (నెల్లూరు), శ్రీవేంకటేశ్వర (తిరుపతి), శ్రీ పద్మావతి (తిరుపతి), యోగి వేమన (కడప), ద్రవిడ (కుప్పం), రాయలసీమ (కర్నూలు), శ్రీకృష్ణదేవరాయ (అనంతపురం) వర్సిటీలలో సాహితీ సదస్సులను నిర్వహించనున్నారు.

వెబ్దునియా పై చదవండి