మన భాషే మరణిస్తే ఆ పాపం ఎవరిది? అమ్మ భాష పిలుస్తోంది రా... కదలిరా....!!
శనివారం, 20 ఫిబ్రవరి 2016 (18:36 IST)
- వ్యాస రచయిత, డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు అధ్యాపకులు, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, తెనాలి(ఆంధ్రప్రదేశ్)
తూర్పు పాకిస్తాన్ లోని బెంగాలీలు, తమ మాతృభాషను అధికార భాషగా గుర్తించాలని ప్రభుత్వం పై పోరాటం చేసిన క్రమంలో ప్రభుత్వ దమనకాండలో నలుగురు యువకులు ప్రాణాలను అర్పించారు. ఈ యువకుల సంస్మరణార్ధం వారు అసువులుబాసిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కాలగమనంలో అంతరించిపోతున్న భాషలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గూర్చి, ఆయా భాష సమాజాల వారు తమ మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గూర్చి తెలియజేయాలనేది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం యెుక్క ముఖ్యోద్దేశ్యం.
ప్రపంచవ్యాప్తంగా వ్యవహారంలో ఉన్న ఆరువేల భాషల్లో ఇప్పటికే మూడు వేల భాషలు మరణించాయని, ఇలాగే కొనసాగితే మరికొన్ని భాషలు మరణిస్తాయని, వాటిలో తెలుగుభాష ఒకటిగా ఉండబోతుందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో ముప్ఫై శాతం మంది ఆ భాషను చదవకుండా, తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మృతభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి, తెలుగు భాషకు ఆ పరిస్థితి రాబోతుందని ఏనాడో హెచ్చరించింది. వ్యక్తి ఉనికిని చాటే అనేకాంశాలలో భాషా కూడా ఒకటి. అట్లే ఒక జాతిని ఉనికిని చెప్పడానికి కూడా భాషే ప్రధాన ఆధారం.
ఒక జాతి మనుగడను చాటే పలు అంశాలలో ఆ జాతి మాట్లాడే భాష కీలకమైనది. కావున ప్రతి జాతి తమ మాతృభాషను కాపాడుకోవాలి. మానవుడు తాను పుట్టి పెరిగిన వాతావరణంలో మాట్లాడటానికీ, తన భావాల్ని- ఆలోచనల్ని- అభిప్రాయాల్ని వ్యక్తీకరించడానికీ, తల్లి పాలతో పాటు వంటబట్టించుకునే భాష మాతృభాష. అలాంటి మాతృభాషను పరిరక్షించి, భాషా వారసత్వాన్ని జాతికి అందించడమనేది పాలకుల బాధ్యత. కానీ దురదృష్టశాత్తు భాష ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఈ తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు మాతృభాషకు నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. ‘కన్నుపోయేంత కాటుక’లాగా తెలుగు పాలకులు ఆంగ్లభాషను తెలుగు వారిపై రుద్దారు. ‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్లుగా తెలుగు ప్రజలు కూడా తమ మాతృభాషాభిమానంలో వెనుకబడిపోయారు. ఆ ప్రతిఫలాన్ని నేటి తెలుగు జాతి అనుభవిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలు మాతృ భాషా చైతన్యంతో ముందుకు సాగుతుంటే, తెలుగు వారు మాత్రం ఆ స్పృహకు పూర్తిగా దూరం కావడం దురదృష్టకరం.
అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా 1953 అక్టోబరు 1వ తేదీన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. మాతృభాష తెలుగు అధికార భాష కావాలని 1955 సెప్టెంబరులో వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన ప్రతిపాదన చాలాకాలం వరకు అమలుకు నోచుకోలేదు. మాడపాటి హనుమంతురావు విశాలాంధ్ర ఏర్పడిన తరువాత కూడా తెలుగు భాషాభివృద్ధికి ఉద్యమాలను నడిపారు. విశాలాంధ్ర ఏర్పడగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగును అధికార భాషగా ప్రకటించి ఉంటే విశాలాంధ్ర సాధించిన ఫలితం ఉండేది. నాడు అటు మద్రాసు నుండి విడివడిన మన నాయకత్వం, నైజాం నుండి విడివడిన ఆ ప్రాంతపు నాయకత్వం అప్పటివరకు అలవాటు పడిన ఆంగ్లభాష వదలలేక ఆ భాషనే అమలు చేయడం శోచనీయం. దీంతో అప్పటి వరకు వచ్చిన ఆంధ్ర భాషోద్యమాలు బూడిదలో పోసిన పన్నీరైనాయి.
వావిలాల గోపాలకృష్ణయ్య రాష్ట్ర శాసనసభలో దాదాపు 9 సార్లు తెలుగుభాషను అధికార భాషగా ప్రతిపాదించడం జరిగింది. చివరకు 1964లో ఈ ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో చోటుచేసుకుంది. మాతృ భాషాభివృద్ధి కోసం 1966లో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అధ్యక్షతన ఒక సంఘం, జె.పి.ఆర్. గ్విన్ అధ్యక్షతన మరో సంఘం కూడా ఏర్పాటైంది. ఈ రెండు సంఘాల సలహాల మేరకు 1968లో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో తెలుగునే అధికార భాషగా ఉపయోగించాలని ఉత్తర్వు వెలువడింది. మరో ఉత్తర్వు ద్వారా న్యాయశాఖలో అనువాద విభాగం ఏర్పడింది. ఈ సంఘాల సిఫార్సుల మేరకు 1968లో తెలుగు అకాడమీ స్థాపించబడింది. 1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పడిన స్థాయి సంఘం విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలని తీర్మానించింది.
ఈ ప్రయత్నాలన్నీ ఆచరణ రూపంలో అమలుపర్చి, పర్యవేక్షించేందుకు 1974 మార్చి 19న ప్రభుత్వం అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసి వావిలాలను అధ్యక్షునిగా నియమించింది. అధికార భాషగా తెలుగును అమలు పర్చేందుకు మరికొన్ని ఉత్తర్వులను ప్రభుత్వం వెలువరించింది. ఇప్పటికి ఐదు దశాబ్దాలు నిండినా ఈ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయే తప్ప అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వాధినేతలకు మాతృభాష పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన చొరవతో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. పి.వి.నరసింహారావు, నందమూరి తారక రామారావు లాంటి ఒకరిద్దరూ ముఖ్యమంత్రులు తప్ప తెలుగు భాషాభివృద్ధికి చెప్పుకోదగ్గ రీతిలో కృషి చేసిన ముఖ్యమంత్రులు లేరనే విషయాన్ని తెలుగు వారందరూ అంగీకరించి తీరాల్సిందే. 1974లో ఏర్పడిన అధికార భాషా సంఘం కూడా తెలుగును అధికార భాషగా చేయడానికి, మాతృభాషాభివృద్ధికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఈ సంఘాన్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయడం ఇందుకు కారణం. వావిలాల గోపాలకృష్ణయ్య, ఎబికె ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్ వంటి కేవలం కొద్దిమంది మాత్రమే అధికార భాషా సంఘం అధ్యక్షులుగా మాతృభాషాభివృద్ధికి కొంత చొరవ చూపగలిగారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు ఒకరికంటే మరొకరు పోటీపడతూ ప్రైవేటు విద్యా సంస్థల ఏర్పాటుకు ఆమోదాన్ని ఇస్తూ వచ్చాయి. పాఠశాల స్థాయిలో ప్రైవేటు విద్యా సంస్థలు విజృభించే కొద్దీ మాతృభాషా వినియోగం, ప్రాధాన్యత మరుగునపడుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రతి ఏడాది దాదాపు 80 శాతం మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమ విద్యాసంస్థలలో చేరుతున్నారు. సహజంగానే వీళ్ళంతా మాతృభాషకు దూరమవుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగాయి. ఈ విద్యా సంస్థల సూచనలనే ప్రభుత్వం అమలుచేస్తూ ముందుకు సాగటం వల్ల మాతృభాషకు తీవ్రమైన విఘాతం కలుగుతుంది. న్యాయస్థానాలలో వాదోపవాదాలు – తీర్పులు, ఫ్రభుత్వం నుండి వెలువడే అన్ని ఉత్తర్వులు ఆంగ్ల భాషలోనే వెలువడుతున్నాయి. క్రమక్రమంగా దైనందిక కార్యకలాపాలలోను, విద్యారంగంలోను, పాలన రంగంలోను మాతృభాష కనుమరుగవుతూ ఉంది.
పరాయి భాషలో పరిపాలన సాగటమనేది నేటి నిరంకుశ రాజ్యాలలో కూడా కన్పించదు. కేవలం వలస దేశాలలో మాత్రమే ఇలా జరుగుతుంది. 70 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం కూడా పరాయి భాషలోనే పరిపాలన, ప్రభుత్వ, న్యాయస్థానాలు నడుస్తున్నాయంటే మన పాలకుల మాతృభాషాభిమాన డొల్లతనం తేటతెల్లమవుతుంది. తెలుగువారు తెలుగు ప్రభుత్వాధినేతలు మాతృభాషను ఆధునిక విద్యా, వైజ్ఞానిక భాషగా వికసింపజేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోగా, బ్రతకడానికి పనికిరాని భాషగా మాతృ భాషను దిగజార్చారు.
మన మాతృ భాష అంపశయ్య మీదున్న తరుణంలోనే రాష్ట్ర విభజన జరిగి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఐతే విభజన విషయంలో ఇరు ప్రాంతాల పాలకులు, నాయకులు అధికారాలు – ఆస్తులకు ఇచ్చిన ప్రాధాన్యత మాతృభాష విషయంలో చూపలేదు. ఎన్నికల అనంతరం ఉభయ రాష్ట్రాల్లోను కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మాతృభాష పరిరక్షణను గూర్చి గానీ, పురోభివృద్ధిని గూర్చి కానీ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలోను – ఎన్నికల సమయంలోను తెలంగాణా తల్లి, తెలంగాణా జాతీయ గీతం, తెలంగాణా యాస తదితర అంశాలను గూర్చి ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసిన ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నాటి నుండి ఈనాటి వరకు తెలంగాణా భాషను గూర్చి ప్రస్తావించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఈ రెండు సంవత్సరాల కాలంలో కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలంగాణా భాషాదినోత్సవంగా ప్రకటించడం తప్ప మాతృభాషాభివృద్ధికి ఆయన చూపిన చొరవ శూన్యమనే విమర్శలున్నాయి.
తెలంగాణా భాషా సంస్కృతుల పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన కేసీఆర్, అధికార పీఠం అధిష్టించాక మాతృభాష కోసం చేసింది మృగ్యమనే చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణా కవులను గూర్చి, గాయకులను గూర్చి తెగ మాట్లాడిన కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసింది శూన్యం. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణా భాషా దినోత్సవంగా తెలంగాణా ఉద్యమ సమయంలో ట్యాంక్ బండ్ పైన ఆంధ్ర కవుల విగ్రహాలు మాత్రమే ఉన్నాయని నిరసన వ్యక్తం చేస్తూ, ఆ విగ్రహాలను ధ్వంసం చేసిన నేటి తెలంగాణా పాలకులు తమ ప్రాంతపు కవుల విగ్రహాలను ప్రతిష్టాంచాలనే ఆలోచనలు ఎంతవరకు చేశారో తమను తాము ప్రశ్నించుకోవాలి.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణా యాసకు పట్టం కడతామని నాడు ప్రకటించిన ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర సమితి పాలకులు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేశారో తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో అక్కడి ప్రభుత్వం పాఠశాలలో తెలుగు బోధన నిలిపివేసి, తెలుగు పాఠశాలలను మూసివేసి, తెలుగు విద్యార్థులు తమిళ మాధ్యమంలోనే పరీక్ష రాయాలని నిర్ణయిస్తే ఈ విషయమై తెలంగాణా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా స్పందించకపోవడం, చొరవ చూపకపోవడం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని మాతృ భాషాభిమానులను మనోవేదనకు గురిచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అధికార తెలుగు భాషా సంఘం లాంటి సంఘాన్ని తెలంగాణాలో ఏర్పాటు చేయడాన్ని గురించి కూడా తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు నోరుమెదపలేదు. తెలంగాణా ఉద్యమానికి జవసత్వాలు కలుగజేసింది సాహిత్యమేనన్న విషయాన్ని సీఎం కెసిఆర్ మర్చిపోయారా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రాష్ట్ర విభజన వల్ల ఈ ప్రాంతపు ప్రజలు తెలుగు విశ్వవిద్యాలయాన్ని, తెలుగు అకాడమీని కోల్పోయారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో చేసిన ప్రసంగంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని, రాబోయే విద్యా సంవత్సరం నుండి ఇంటర్‌మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా మాతృభాషను అందరు విద్యార్థులు అభ్యసించి తీరాల్సిందేననే జీవోను తీసుకొస్తామని ప్రకటించారు. ఆరు మాసాలు గడుస్తున్నా పైన పేర్కొన్న అంశాల అమలు విషయంలో ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు.
అదే సభలో ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ అధికార సంఘం అధ్యక్షునిగా పొట్లూరి హరికృష్ణను నియమిస్తున్నట్లు ప్రకటించారు. నూతన అధికార భాషా సంఘ అధ్యక్షుని హోదాలో ఈ ఆరు నెలల్లో హరికృష్ణ నిర్వహించిన కార్యక్రమం గానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం గానీ లేదు. నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు అకాడమీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై కూడా తెలుగు భాషాభిమానులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావల్సిన అవసరం ఉంది. అలాగే జపాన్ భాషను బోధనా భాషగా విశ్వవిద్యాలయాల్లోకి తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో ఆసక్తిని కనపరుస్తున్నారు.
ఈ ఆసక్తిలో కొంచెమైనా కొడిగడుతున్న మాతృభాషపై చూపిస్తే బాగుంటుంది. అట్లే నూతన రాజధానిని సింగపూర్‌ను తలపించేటట్లు రూపొందిస్తామని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుందర రాజధానిని నిర్మించబోతున్నామని తెలుగుదేశం పాలకులు చెబుతున్నారు. రాజధాని అంటే ఒక ప్రాంతంలో నివసించే ప్రజల భాషా సంస్కృతులకు కూడలిగా ఉండాలనే విషయాన్ని మర్చిపోకూడదు. ఐతే తమిళనాడు ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోతున్న అక్కడి తెలుగు విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూపిన చొరవ హర్షించదగినది.
ఆంగ్ల, హిందీ భాషల ప్రభావంతో నానాటికి కనుమరుగవుతున్న మాతృభాషను బ్రతికించడానికి ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. పాలన రంగంలోను, విద్యారంగంలోను అధికార భాషగా తెలుగును విధిగా ఉపయోగించేలా ఇరు తెలుగు ప్రాంతాల పాలకులు చర్యలు తీసుకోవాలి. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో అమలు జరుగుతున్న విధంగా సచివాలయ స్థాయిలో తెలుగుభాషా సంస్కృతులకు ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి. అప్పుడే తెలుగుభాషకు కొంతైనా న్యాయం జరుగుతుంది.
అధికార సమావేశాల్లోనూ, సభల్లోనూ, మంత్రులు- ప్రజా ప్రతినిధులు- నాయకులు- అధికారులు- అనధికారులు మొదలైన వారంతా తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి. ఇది ఒక నియమంగా వుండాలి. ప్రభుత్వ తయారుచేసే ప్రతి చట్టాన్ని మొదట మాతృభాషలో రూపొందించి తరువాత అవసరమైతే ఇతర భాషలలోకి అనువదించాలి. మాతృభాషను పాలనరంగంలో నూటికి నూరుపాళ్ళు అమలు చేయాలి. న్యాయవ్యవస్థలో న్యాయవాదుల వాదోపవాదాలు, తీర్పులు పూర్తిగా కనీసం జిల్లా కోర్టుల వరకు అధికార మాతృభాషలో జరగాలి. ప్రభుత్వ కార్యాలయాలలో రికార్డులే గాక వివిధ రకాల పేర్ల పలకలు తెలుగులోనే రాయించాలి.
సంక్షేమ పథకాల ప్రచారానికి కోట్లు ఖర్చు పెడుతున్న తెలుగు ప్రభుత్వాలు అందులో కొంత మాతృభాష ప్రచారానికి ఖర్చు చేస్తే తెలుగు భాషకు ప్రాణం పోసిన వారౌతారు. మాతృభాషా సంరక్షణలో ప్రసార మాధ్యమాల పాత్ర అనిర్వచనీయమైనది. ప్రసార మాధ్యమాలు కూడా మాతృభాషా స్పృహలో వెనుకబడి వున్న తెలుగు ప్రజలను చైతన్య పర్చాలి. ప్రభుత్వాలు చూపే అత్యుత్సాహ చర్యల వల్ల మాతృభాషాభివృద్ధికి విఘాతం కలిగితే పాలకుల తప్పులను ఎత్తిచూపాలి.
‘ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిద’ని శ్రీశ్రీ అన్నట్లుగా, మన భాషే మరణిస్తే ఆ పాపం ఎవరిది? మనందరిది. ‘దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగు’ అన్నాడు తిక్కన. ఒక చెడ్డ పరిణామం వస్తుంటే దానిని నివారించగల శక్తి ఉండి కూడా ఉపేక్ష వహించిన వాళ్ళకే చెడు చేస్తుందని అర్ధం. మన భాష విషయంలో కూడా ఈ జాగ్రత్త అవసరం. మన తల్లిని మనం కాపాడుకున్నట్లు మన తల్లి భాషను కూడా మనమే కాపాడుకోవాలి.
ఒక జాతి ఐక్యతకు ఆ మాతృభాషే ప్రధాన కారణం అవుతుంది. ఒక జాతి నాగరికత, పారిశ్రామికాభివృద్ధి, ఆ జాతి భాష ద్వారానే పురోగమిస్తాయి. ఒక జాతి సంగీత సాహిత్య కళా ప్రక్రియలు మాతృభాషతోనే అభివృద్ధి చెందుతాయి. ప్రతి జాతి తన మాతృభాష ద్వారా మాత్రమే అన్ని రంగాల్లో అభివృద్ది సాధించగలుగుతుందనేది చారిత్రక నగ్న సత్యం. తెలుగు భాషా సంరక్షణ అన్నది కేవలం ఒక మనోభావం కాదు. అదొక సామాజిక అవసరం. “దేశ క్షేమమునకు భాషా క్షేమము పునాది” అనే వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తి పంతులు అభిప్రాయాన్ని రాజకీయ నాయకుల నుండి సామాన్య పౌరుల దాకా అందరూ ఆలోచించి అర్ధం చేసుకుంటే భాష సమస్య పరిష్కారమౌతుంది.
- వ్యాస రచయిత, డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు అధ్యాపకులు, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, తెనాలి(ఆంధ్రప్రదేశ్)