రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను... సిలికాన్ ఆంధ్రా ఆధ్వర్యంలో నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి తీర్మానించింది. ఈ మేరకు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో అనేక కొత్త నిర్ణయాలను తీసుకున్నారు.
ముఖ్యంగా.. 60 సంవత్సరాలు దాటిన వందమంది వేద పండితులకు లక్ష రూపాయల బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ మండలి నిశ్చయించింది. అలాగే హరిజనవాడల్లో రామాలయం, వేంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందజేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా... జడ్చర్ల లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి, విజయనగరానికి చెందిన రామతీర్థం ఆలయానికి 25 లక్షల రూపాయల చొప్పున కేటాయించినట్లు పాలకమండలి తెలియజేసింది. ఇంకా, టీటీడీ వేద పాఠశాలల్లో దళితులకు ప్రవేశం కల్పిస్తామని, వారికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని వెల్లడించింది. ఆళ్వారు దివ్య ప్రబంధాలను కూడా తెలుగులోకి అనువదించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పాలకమండలి పేర్కొంది.