ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. విజయవాడలోని స్వాతంత్ర్య సమరయోధుల సంఘం భవనంలో "శత వసంతాల శ్రీశ్రీ" సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్యవక్తగా పాల్గొన్న వరవరరావు మాట్లాడుతూ... విప్లవ రచయితలకు శ్రీశ్రీయే స్ఫూర్తిదాయకం అని అన్నారు.
చైనా యుద్ధ కాలంలో అప్పటి ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపించి సీపీఎం, సీపీఐ నాయకులను అణచివేయాలన్న ఉద్దేశ్యంతో ముందస్తు అరెస్టు చట్టాన్ని అమలు చేసిందని వరవరరావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఏకే గోపాల్‌ను అరెస్టు చేయడం, భూమయ్య, కిష్టయ్య గౌడ్‌లను ఉరితీయడం లాంటి సంఘటనలు జరిగాయని ఆయన అన్నారు.
అలాంటి సమయంలోనే... ప్రభుత్వ దుర్మార్గ చర్యలను అడ్డుకోవాలని కోరుతూ శ్రీశ్రీ విప్లవోద్యమాన్ని నిర్మించారని వీవీ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో పుట్టిన నక్సల్‌బరీ ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేసేందుకుగానూ శ్రీశ్రీ కళింగ నుంచి కర్ణాటకదాకా పర్యటించారని తెలిపారు.