డిసెంబరు 25వ తేదీన చెన్నై నగరంలో తెలుగు కళావైభవం

మంగళవారం, 14 డిశెంబరు 2010 (18:37 IST)
File
FILE
ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన తెలుగు కళావైభవం జరుగనుంది. స్థానిక శాంథోమ్‌, ఎంఆర్‌సి నగర్‌లోని మేయర్ శ్రీరామనాథన్ చెట్టియార్ సెంటర్‌లో ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని సమాఖ్య అధ్యక్షురాలు వీఎల్.ఇందిరా దత్ మంగళవారం చెన్నై‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి అంతర్జాతీయ ద్వైవార్షిక మహాసభల పేరుతో ఈ వేడుకలను నిర్వహిస్తామన్నారు.

ఇప్పటి వరకు ఎనిమిది మహాసభలను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. తొలి మహాసభ చెన్నైలో 1994లో జరిగిందన్నారు. ఆ తర్వాత ప్రతి రెండేళ్ళకొకసారి నిర్వహించే ఈ సభలు గతంలో హైదరాబాద్, న్యూఢిల్లీ, విశాఖపట్టణం, సింగపూర్, బెంగుళూరు, విజయవాడ నగరాల్లో విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. తాజాగా తొమ్మిదో మహాసభలను డిసెంబరు 25వ తేదీన శనివారం చెన్నైలో నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ఈ వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం 9 గంటల ప్రతినిధుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆరంభమవుతుందన్నారు. ఇందుకోసం ప్రవేశ రుసుంగా గత యేడాది రూ.2500గా ఉన్నదాన్ని ప్రస్తుతం రూ.500కు తగ్గించినట్టు చెప్పారు. ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే మహాసభకు ఆర్బీఐ మాజీ గవర్నర్ వై.వేణుగోపాల్ రెడ్డి (వై.వి.రెడ్డి ) ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రముఖ సినీ నిర్మాత, సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు, ప్రముఖ సినీ నటి శ్రీదేవిలు గౌరవ అతిథులుగా హాజరవుతారని చెప్పారు.

ఈ ద్వైవార్షిక సభల సందర్భంగా యార్లగడ్డ ప్రభావతి-శంభూప్రసాద్ స్మారక పురస్కారాలను ప్రముఖ రచయిత మాలతీ చందూర్, సాహీతీవేత్త దేవేళ్ళ చిన్నికృష్ణయ్యలకు అందజేస్తామని చెప్పారు. అలాగే, సీనియర్ జర్నలిస్టు దివంగత బీఎస్ఆర్ కృష్ణ పేరుపై ప్రవేశపెట్టిన స్మారక పురస్కారాన్ని ప్రముఖ పాత్రికేయులు, పత్రికా రచయిత డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావుకి ప్రదానం చేస్తామన్నారు.

ప్రారంభ సమావేశాలు ముగిసిన తర్వాత సమాఖ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ కళాకారుతో బోనాలు నృత్యం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చే తెలుగు సంఘాల ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు.

మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ రకాల సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇందులో 'డ్యూయట్ శ్రీధర్ గాత్ర కళా ప్రదర్శన', 'నవ్వుకుందా రండి' (హాస్యావధానం), 'తెలుగు ప్రశస్తి' కూచిపూడి నృత్యరూపకం, 'దీప తరంగిణి', 'తెలుగింటి బంగారు ఆడపడుచు' వంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రతినిధుల దరఖాస్తుల (అప్లికేషన్స్)ను డబ్ల్యూటీఎఫ్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చని ఇందిరా దత్ వివరించారు. కాగా, ఈ మీడియా సమావేశంలో సమాఖ్య సెక్రటరీ శ్రీలక్ష్మీ మోహన్ రావు, కోశాధికారి శివరామ ప్రసాద్, ప్రమీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి