దేశవ్యాప్తంగా ఘనంగా "హిందీ దివస్" వేడుకలు

దేశవ్యాప్తంగా హిందీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా "హిందీ డే"ను పురస్కరించుకొని న్యూ ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో హోం మంత్రి పి చిదంబరం హిందీ భాషలో ప్రసంగించి ప్రేక్షకుల మది దోచుకున్నారు. అయితే.. అసలు ఈ హిందీ దినోత్సవం అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటాం? ఎప్పుడు జరుపుకుంటాం? హిందీ భాష ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ శీర్షిక చదవండి.

మన జాతీయ భాష(నేషనల్ ల్యాంగ్వేజ్)గా పేరుగాంచిన "హిందీ" భాషకు సెప్టెంబర్ 14న ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14ను "హిందీ దివస్" (హిందీ దినోత్సవం)గా జరుపుకుంటారు. ఇందుకు గల కారణం 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుండి ఈ తేదీను హిందీ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీ.

అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించబడింది. ఈ భాష ఇండో యూరోపియన్ భాష సంతతికి సంబంధించిన ఇండో-ఆర్యన్ శాఖకు చెందినది. హిందీ అంటే "పర్షియన్ కానుక" అని అర్థం. హిందీ భాష చాలావరకూ సంస్కృతం నుంచి గ్రహించబడినది. అయితే కాలక్రమంలో ఉత్తర భారతదేశంలోని ముస్లిం ప్రభావం వల్ల పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష ఆవిర్భవించింది.

మనం గమనించినట్లయితే శుద్ధ హిందీ(ప్యూర్ హిందీ) భాషను రేడియోలలో, టి.వి. వార్తలలో వినవచ్చు. ప్రస్తుతం చలామణిలో ఉన్న హిందీ భాష చాలా వరకూ సులభతరం చేయబడింది. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడుతారు. మారిషస్, ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్ వంటి చాలా దేశాలలో ఇప్పటికీ హిందీ ముఖ్య భాషగా ఉంది.

అయితే... మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది కావడం. ఇది మనం అందరం గర్వించదగిన విషయం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా దేశంలో ఐక్యతను తీసుకురావడానికి ఈ భాషనే వాడేవారు. ఈ భాషను "లాంగ్వేజ్ ఆఫ్ యూనిటి" అనేవారు. అంత గొప్పది మన హిందీ భాష, అందుకే అన్నారు మేరా భారత్ మహాన్ అని..! కాబట్టి హిందీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భాష సమస్య లేకుండా జీవించ వచ్చన్నమాట.

వెబ్దునియా పై చదవండి