పువ్వెందుకు పరిమళిస్తుందో... అందుకే నా హృదయం ప్రేమిస్తుంది

WD
పువ్వు ఎందుకు పరిమళిస్తుందో... వెన్నెల ఎందుకు పూస్తుందో... నీరు ఎందుకు పారుతుందో... గాలి ఎందుకు వీస్తుందో... అందుకే నా హృదయం ప్రేమిస్తుంది.. అంటూ తన భావాలను గుండెల నుంచి వెలికి తీసి తెలుగువారికి పంచిన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.

ఆయన మనసు నుంచి పూచిన ప్రతి పాటా తెలుగువారి హృదయ తంత్రులను మీటక మానవు. ప్రకృతి సౌందర్యం, లాలిత్యం, సౌకుమార్యం కలబోసిన ఆయన కవితలు మధురాతి మధురం. మచ్చుకు ఓ గీతిక...

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా !! ఆకులో ఆకునై !!

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై !! గలగల !!
జలజలని పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈ యడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా

తరులెక్కి యలనీలిగిరి నెక్కి మెలమెల్ల !! తరులెక్కి !!
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై యేకతమ తిరుగాడ
ఈ యడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా !! ఆకులో ఆకునై !!

వెబ్దునియా పై చదవండి