కట్టప్ప నిజంగా బాహుబలిని చంపలేదా? తల పట్టుకుంటున్న బాహుబలి అబిమానులు

శనివారం, 18 మార్చి 2017 (04:21 IST)
రెండేళ్లుగా ప్రపంచ వ్యావ్తంగా సినిమా జనాలను వెర్రెత్తిస్తున్న ప్రశ్న. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఈ ప్రశ్న కోట్లమందిని ఇంకా సందేహంలో ముంచెత్తుతూనే ఉంది కానీ బాహుబలి2 వీడీయో ట్రైలర్ గురువారం విడుదలయ్యాక అభిమానులకు మరో సందేహం పుట్టుకొ్చ్చి తలపట్టుకుని గింజుకుంటున్నారు. నేను చంపమంటేనే కట్టప్ప బాహుబలిని చంపాడు అంటూ గతంలో రాజమౌళి చేసిన టీజింగ్ కూడా వీళ్లిప్పుడు గుర్తు తెచ్చుకుని నిజంగా కట్టప్ప బాహుబలిని చంపి ఉంటాడా అనే సందేహంలో పడిపోయారు.
‘బాహుబలి – ది బిగినింగ్’ సినిమా పూర్తయిన తర్వాత అందరి మదిలో మెదిలిన ప్రశ్న… “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు” అని! ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దీనిని తన రాజకీయ ప్రచారానికి సైతం వినియోగించుకున్నారంటే, ఏ స్థాయిలో ఈ ప్రశ్న పాపులర్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ ట్రైలర్ విడుదలతో మరోసారి ఈ ప్రశ్న హాట్ టాపిక్ అయ్యింది. అందులోనూ ఈ ట్రైలర్ లో ‘బాహుబలి’ని కట్టప్ప కత్తితో పొడవడం, అలాగే బాహుబలి వెనక్కి తిరిగి చూడడం రెండు షాట్లు ఉన్నాయి. 
 
మరి దీని వెనుక ఉన్న ట్విస్ట్ ఏమిటన్నది సినిమా విడుదలైతే గానీ తెలియదు గానీ, అంతకుముందుగానే అసలు ఎందుకు చంపాడు అన్న దానికి రకరకాల ఊహాగానాలు తెరపైకి రావడం సహజమే. కట్టప్పను బ్లాక్ మెయిల్ చేసి భళ్ళాలదేవుడే ఈ పని చేయించి ఉంటారనేది గత ఏడాది కాలంగా హల్చల్ చేస్తోన్న ఒక అంశం. అయితే అసలు కట్టప్ప చంపి ఉండరని, ఇందులో ఏదో మతలబు ఉందని, ఖచ్చితంగా రాజమౌళి మార్క్ ట్విస్ట్ ఉంటుందని… తాజాగా ట్రైలర్ విడుదలైన తర్వాత వస్తున్న భావనలు. 
 
ఇవన్నీ ఇలా ఉంచితే… ఇదే ప్రశ్న రాజమౌళిని అడిగితే… అవును… ఖచ్చితంగా ఎవరి ఊహాగానాలు వారికి ఉంటాయి. ఒకవేళ ఎలాగైనా సమాచారం లీక్ అయినా గానీ అందులో తమకు వచ్చిన ఇబ్బంది లేదు. సిల్వర్ స్క్రీన్ పైన మనం ఎంత ఆసక్తికరంగా దానిని చూపించాము అన్నదే కీలకం అవుతుంది తప్ప, సదరు ప్రశ్న హైలైట్ కాబోదు అని రాజమౌళి స్పష్టం చేసారు. 
 
దీంతో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న దానిపై రాజమౌళి పెద్దగా ఫోకస్ చేయలేదు గానీ, ఏ పరిస్థితుల్లో చంపాడు అన్న దానినే హైలైట్స్ గా చూపించబోతున్నారనేది స్పష్టం. అంటే ‘బాహుబలి’లో మిస్ అయిన రాజమౌళి మార్క్ ఏమోషన్ సన్నివేశాలు ‘బాహుబలి 2’లో పుష్కలంగా ఉండనున్నాయి. 
 
అయితే టాలీవుడ్ లో జరుగుతున్న మరో ప్రచారం ఏమిటంటే… ‘బాహుబలి 2’ ఆడియో వేడుక పై గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గానీ రాజమౌళి ఈ ప్రశ్నకు పరోక్షంగా సమాధానం ఇచ్చేయవచ్చు అని! ‘మర్యాద రామన్న’ వంటి సినిమాలకు ముందుగానే స్టోరీ మొత్తం చెప్పేసి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరిత్ర జక్కన్నది. కాబట్టి ముందుగా చెప్పేసినా “బాహుబలి 2”కు పెద్దగా ఇబ్బంది కలుగకపోవచ్చు.
 
ఈ కొత్త గండరగోళంతో జనాలను ఇప్పుడు రెండు ప్రశ్నలు వేధిస్తున్నట్లున్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?.. కట్టప్ప నిజంగా బాహుబలిని చంపలేదా?
 

వెబ్దునియా పై చదవండి