అంచనాలకు అనుగుణంగా.. ఆకట్టుకోని 'అగ్గి'

సోమవారం, 3 సెప్టెంబరు 2007 (15:11 IST)
WD PhotoWD
నటీనటులు: అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్, అజయ్‌దేవగన్, ప్రశాంత్ రాజ్, సుస్మితాసేన్, నిషాకొఠారి తదితరులు

సాంకేతిక వర్గం: దర్శకత్వం: రాంగోపాల్ వర్మ , మాటలు: రవిశంకర్, సంగీతం: బప్పిలహరి, అమర్ మొహిలి, విషాల్ భరద్వాజ్, నిర్మాణసంస్థ: ఫ్యాక్టరీ

ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విధి నిర్వహణలో మాఫియాడాన్‌ను ఎదుర్కోబోయో క్రమంలో ఆయన తమ్ముడిని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత మాఫియాడాన్ పోలీసు అధికారిపై పగతీర్చుకుంటాడు. ఈ నేపథ్యంలో జరిగే కథాగమనమే `అగ్గి`. హిందీలో `ఆగ్`, ఒకరకంగా చెప్పాలంటే `అగ్గి`కు అంత పవర్‌లేదు. నీళ్ళుపడి చల్లబడిపోయిందని చెప్పాలి. తెలుగువెర్షన్ ఆడియో కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు అగ్గితో ఉన్న కాగడాలను చుట్టూరా పెట్టారు.

కానీ ప్రారంభమయ్యే సమయానికి తేలికపాటి వర్షం పడి కొన్ని కొండెక్కాయి. అయినాసరే ఈ అగ్గి మాత్రం మండుతూనే ఉంటుదని రాంగోపాల్‌వర్మను పొగడ్తలతో వక్తలు ముంచెత్తారు. ఇక అమితాబ్‌బచ్చన్ మాత్రం గబ్బర్‌సింగ్ పాత్ర వేయడం తన చిరకాల కోరిక అని ప్రకటించారు. ఆ రోజుల్లో మనస్సులో ఉన్న కోరికను వెళ్ళగక్కలేక హీరోగా చేశానని చెప్పాడు. మరి అప్పుడు చేసి ఉంటే `షోలే` వేరుగా ఉండేది. కానీ ఇంత వయస్సువచ్చాక ఆ పాత్రను పడించలేకపోయారు.

కథ: అందరికీ తెలిసిన `షోలే` కథను కొత్తగా చెబుదామనుకునే తాపత్రయంలో తీసిన చిత్రమిది. నరసింహా (మోహన్‌లాల్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓసారి ఓ వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. అతను మాఫియాడాన్ బబ్బర్‌సింగ్ (అమితాబ్)కు సోదరుడు. దీంతో తన తమ్ముడ్ని చంపిన పోలిస్ అధికారిపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా అతని ఫ్యామిలీని చంపేసి నరసింహ వేళ్ళను కత్తిరిస్తాడు. `షోలే`లో సంజీవ్‌కుమార్ పాత్ర అది.

WD PhotoWD
ఇదిలా ఉండగా, రాజ్ (ప్రశాంత్‌రాజ్), గురు (అజయ్‌దేవగన్) బతుకుదెరువు కోసం సిటీకి వస్తారు. ఓ సందర్భంగా నరసింహకు వారు సాయపడతారు. వీళ్ళను పావుగా పెట్టుకుని తన పగ తీర్చుకోవాలని నరసింహ చేసే ప్రయత్నమే సినిమా అంతా. ఇందులో గురు మహిళా ఆటోడ్రైవర్ గౌరి (నిషాకొఠారి)ని ప్రేమిస్తాడు. మధ్యలో వీళ్ళ లవ్‌ట్రాక్ రిలాక్స్‌ అన్నమాట. ఇక మిగిలిన కథ తెలుసుకోవాలంటే పాత షోలే చూస్తే సరిపోతుంది.

బబ్బన్‌సింగ్ పాత్రలో అమితాబ్‌ను ఎక్కువసేపు చూడలేం. ఆ పాత్ర చాలామందికి రుచించలేదు. అజయ్‌దేవగన్ పాత్ర సరితూగింది. ప్రశాంత్‌రాజ్ కొత్తయినా కొన్ని సీన్స్‌లో నటించలేకపోయాడు. నిషాకొరాఠి పాత్ర రఫ్‌గా బాగానే చేసింది. ఈ కథలో ఎమోషనల్ ఎవరూ సరిగ్గా పండించలేకపోయారు. చిన్నప్పటి నుండి మదిలో ఉన్న `షోలే` చిత్రం ఇన్‌స్పిరేషన్‌తో తీశానని చెప్పి అందులో నటించిన వారికి శ్రద్థాంజలిగా భావిస్తున్నానని ప్రకటన ఇచ్చాడుకూడా.

కానీ ఆ సినిమాను చూసిన వారికి ఇది సెటైర్‌గా అనిపిస్తుంది. సంగీతం మోస్తరుగా ఉంది. మెహకబూబా పాటలో ఒక్కషాట్‌లో అభిషేక్ కన్పిస్తాడు. కొన్నిచోట్ల విలన్‌ పాత్రపై సానుభూతి కనిప్పిస్తుంది. అలా ఉన్న ఏ సినిమాలు విజయం కాలేదు. ఇది కూడా అంతే. ప్రేక్షకుల్నిమెప్పించే అంశమొక్కటీలేదు. పాత్రలు తెరపై ఎంత కష్టపడినా ఏదో దృశ్యం చూసిన ఫీలింగ్ తప్పితే కథలో ఇన్‌వాల్‌మెంట్‌లేదు. అసలు వర్మే దర్శకత్వం వహించాడా అన్న సందహం చాలామందికి కలుగుతుంది.