ఆత్మ రూపంలో ఉన్న అమ్మాయే ప్రేయసి... అది ఎందుకంటే...?

శుక్రవారం, 8 జూన్ 2012 (15:53 IST)
WD
నటీనటులు: రామ్‌, తమన్నా, షిండే, సుమన్‌, రఘుబాబు, బ్రహ్మానందం, రుషి తదితరులు
సంగీతం: జీవి ప్రకాష్‌, నిర్మాత: రవికిషోర్‌, దర్శకత్వం: కరుణాకరన్‌.

ప్రేమకథా చిత్రాలు తీయడంలో కరుణాకరన్‌ది ఒక ప్రత్యేక శైలి. తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌ వంటి చిత్రాలను కొత్త కథాంశాలతో తెరపైకి ఆవిష్కరించిన ఆయన ఈసారి విభిన్న అంశాన్ని ఎన్నుకున్నాడు. అదే ఆత్మ ప్రేమకథ "ఎందుకంటే ప్రేమంట". బతికున్నవారిని ప్రేమించడం రొటీన్‌ కథ. కానీ బతికినా జీవచ్ఛవంలా ఉన్న... అంటే కోమాలో ఉన్న ఓ అమ్మాయి ఓ యువకుడ్ని ప్రేమించడం సరికొత్త అంశం. దీన్ని ఎలా డీల్‌ చేశాడు. ఇది అందరికీ నచ్చుతుందా లేదా అనేది పక్కనపెడితే... సరికొత్తగా డీల్‌ చేశాడనే చెప్పవచ్చు.

కథలోకి వెళితే... 1980లో కథ మొదలవుతుంది. మూడేళ్ళుగా బస్టాప్‌లో రోజూ అటుగా వచ్చే కాలేజీ బస్‌లో శ్రీనిధి(తమన్నా) కోసం ఎదురుచూస్తుంటాడు కృష్ణ (రామ్‌). కానీ తన కుటుంబ పరిస్థితుల రీత్యా ఆమె తన ప్రేమను వ్యక్తం చేయలేదు. చివరికి రామ్‌ స్వయంగా ఆమెకు ప్రపోజల్‌ చేసే సమయానికి అనుకోని దుర్ఘటనతో మృత్యువాతపడతాడు. దీంతో షాక్‌కు గురయి తను కూడా చనిపోతుంది.

ఆ తర్వాత ఇప్పటి జనరేషన్‌లో పుడతారు. పారిస్‌లో అంబాసిడర్‌ సుమన్‌ కుమార్తె స్రవంతి (తమన్నా)గా పుడుతుంది. ఆమెకు ఓ కలకంటుంది. రోడ్డుపై ఒంటరిగా ఉన్న ఆమెపైకి ఎవరో యువకుడు వచ్చి రోడ్డుపై పడి ఉన్న కోకో కోలాడబ్బాను కాలితో తంతాడు. అది వచ్చి స్రవంతి తలకు తగులుతుంది. అతను ఎలా ఉన్నా అతనే తన లవర్‌ అని ఫిక్స్‌యిపోయింది.

మరోపక్క హైదరాబాద్‌లో ఓ వ్యాపారవేత్త షిండేది పెద్దకుటుంబం. అందులో రామ్‌ (రామ్‌) చదువుసంధ్య లేకుండా ఆవారాగా తిరిగేస్తుంటాడు. అబద్దాలు ఆడేస్తూ.. అందరినీ మాయచేస్తుంటాడు. వీడివల్ల తన పరువుప్రతిష్టలకు భంగం ఏర్పడుతుందని వ్యాపారం విస్తరణ కోసమని పారిస్‌లో తన స్నేహితుడు రామినీడు దగ్గరకు పంపిస్తాడు. అక్కడ అతనికి వైన్‌ను తయారుచేసే కంపెనీ ఉంటుంది. ఇక రామ్‌ అక్కడ ఇబ్బందులు పడుతూ పారిపోవాలనుకునే సమయానికి స్రవంతి (తమన్నా) కన్పిస్తుంది.

ఆమె తన గురించి అబద్దాలు చెబుతూ.. రామ్‌ను ఆటపట్టిస్తుంది. ఆఖరికి ఆమె సాయం వల్ల హైదరాబాద్‌ వస్తాడు. అప్పటికే ఆమె కూడా హైదరాబాద్‌ వచ్చేస్తుంది. షాక్‌కు గురయినా... తర్వాత తను ఆత్మ అని రామ్‌కు చెప్పేస్తుంది. అక్కడ గాంధీ ఆసుపత్రిలో ఉన్న తన దేహాన్ని చూపిస్తుంది. కోమాలో ఉన్నా ఆమెకు ఐసీయులో వైద్యసేవలు జరుగుతుంటాయి.

ఈ విషయం డాక్టరైన రామ్‌ తన అక్కకు చెబుతాడు. ఆమె ట్రీట్‌మెంట్‌ ప్రారంభిస్తుంది. జర్మనీలో ఉన్న మెడిసిన్‌ మూడు డోస్‌లువస్తే బతికే ఛాన్స్‌ ఉందంటుంది. అలా మూడో డోస్‌ వేసే సమయానికి స్రవంతిని చంపేయాలని సుమన్‌ అసిస్టెంట్‌ రుషి హైదరాబాద్‌ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.

కళాకారుల తీర
WD

రామ్‌ గురించి చెప్పక్కర్లేదు. ఎనర్జిటిక్‌గా నటించాడు. హావభావాలు సన్నివేశపరంగా ఉన్నాయి. మాటలే కాదు చేతలు కూడా స్పీడ్‌గా చూపించాడు. తమన్నా ఆత్మగా నటించింది అన్నంత ఫీల్‌ కల్గించింది. రఘుబాబు, బ్రహ్మానందం పాత్రలు కామెడీని పండిస్తాయి. రచయిత కోన వెంకట్‌ విలన్‌గా ఓ పాత్ర చేశాడు. కామెడీకి ప్రత్యేక ట్రాక్‌ లేకుండానే హీరో అతని పక్కన క్యారెక్టర్లే నవ్విస్తాయి.

సంగీతపరంగా జి.వి. ప్రకాష్‌ కొత్తగా అన్పించవు. కానీ అలాఅని క్యాచీగా కూడా లేవు. సీరియస్‌గా సాగే సన్నివేశంలో వెంటనే పాటపెట్టడమనేది రొటీన్‌ ఫార్ములా ఉంటుంది. పైగా ఆత్మతో హీరో ట్రావెల్‌ అవుతుండగా పాటలు పాడుకోవడం కూడా చిత్రానికి మైనస్‌గా అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, రీరికార్డింగ్‌ బాగున్నాయి. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునే ఉన్నా... క్లైమాక్స్‌ సన్నివేశం అప్పట్లో కమల్‌హాసన్‌ నటించిన వసంతకోకిలను గుర్తు చేస్తుంది. రెండు జన్మల ప్రేమ ట్రాక్‌ మగధీర కాన్సెప్ట్‌ను గుర్తుకు తెస్తుంది. ఇదికాకుండా... ఆత్మ, ప్రేమ, పగ అనే అంశాలు రాజమౌళి 'ఈగ' పాట్రన్‌లా కూడా ఉందేమోనని ఆలోచన కల్గిస్తుంది.

ఈ చిత్రంలో ఆత్మ కాన్సెప్ట్‌ కాస్త కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఎవరికీ కన్పించని తమన్నా ఒక్క రామ్‌కు ఎందుకు కన్పిస్తుంది. అనే పాయింట్‌కు గత జన్మ క్లిప్పింగ్‌ చూపిస్తాడు. మరి రామ్‌కు గత జన్మ గుర్తుకు రాదు. నిన్ను ఏమని పిలవాలి.. ఆత్మ అనవచ్చా అని అడిగితే.. నువ్వు ఏదనుకుంటే అదే అని తమన్నా చెబుతుంది. ఆత్మ అంటే దేహం లోంచి ప్రాణం పోతేనే ఆత్మ అంటారు గదా. మరి నాడికొట్టుకుంటూ కోమాలో ఇంతకాలం ఎలా ఉంటుంది.. అనే లాజిక్కులు వెతుక్కుంటే సినిమాను సరిగ్గా చూడలేం. స్రవంతి బ్రతకడం, ఆ తర్వాత తను కన్న కల క్లైమాక్స్‌లో నిజం కావడంతో కథ ముగుస్తుంది. ఒక కొత్త ప్యాట్రన్‌లో లవ్‌ ట్రాక్‌ను తీశాడనే లాజిక్కుతో చూసే క్లాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యే సినిమా ఇది. ఏది ఏమైనా కరుణాకరన్‌ ప్రేమకథను భిన్నంగా తీయగలిగాడు.

వెబ్దునియా పై చదవండి