'గ్రీకు వీరుడు'ని చూపించిన 'సుకుమారుడు'... 'తడాఖా' ముందు నిలబడతాడా...?!!

శుక్రవారం, 10 మే 2013 (21:55 IST)
WD
సుకుమారుడు నటీనటులు: ఆది, నిషా అగర్వాల్‌, కృష్ణ, శారద, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, చలపతిరావు, రావురమేష్‌ తదితరులు.

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: వేణుగోపాల్‌, దర్శకత్వం: అశోక్‌.

సినిమా కథలు ఒక సినిమాకు మరో సినిమాకు వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఒక్కోసారి ఒకే సినిమా కథ ఇంకో సినిమా కథకు సింక్‌ అవుతుంటుంది. అలాంటిదే సుకుమారుడు. ఆది చేసినవి ప్రేమకావాలి, లవ్‌లీ అయినా మూడో చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి సాయికుమార్‌ ఫాన్స్‌లో ఉంది. ఆ ఆసక్తి పిల్లజమిందార్‌ తీసిన దర్శకుడు అశోక్‌ కావడంతో ఇంకా ఎలా తీస్తాడో అన్న ఉత్సాహంకూడా నెలకొంది. మరి ఈ సినిమాను ఎలా తీశాడో చూద్దాం.

కథ : యూరప్‌లో ఉన్న తండ్రి శ్రీనివాస్‌ (సంజీవ్‌) కొడుకు సుక్కు- సుకుమార్‌ (ఆది). తల్లి చనిపోవడంతో తండ్రి పెంపకంలో ఆర్థిక సంబంధాలకే పెద్ద పీట వేస్తాడు. అనుబంధాలు, కుటుంబబాంధవ్యాలకు నో వేకెన్సీ. సొంతగా ఏదో బిజినెస్‌ చేదామని ట్రై చేస్తే.. సూరిటీకింద ఆఫ్‌మిలియన్‌ డాలర్లు బ్యాంక్‌వారు అడుగుతారు. దానికోసం ఇండియాలో అమ్మమ్మ వర్దనమ్మ (శారద) ఇంటికి వస్తాడు. మరీ చాదస్తపు మనిషి. కాస్త చెవుడుకూడా ఉంటుంది.

ఆమెను ఒప్పించి ఆమెకున్న 150కోట్ల ఆస్తికి వారసుడిగా సుకుమార్‌ ట్రై చేస్తాడు. మరోవైపు.. వర్ధనమ్మ కొడుకు కూతురు కూడా ఆ ఊరువస్తుంది. దీంతో అసలైన వారసురాలు ఈమే అవుతుంది గనుక ... సుకుమార్‌ ఆమెను ట్రాప్‌ చేస్తాడు. ఇదిలా ఉండగా, ఎప్పుడెప్పుడు యూరప్‌ వెళ్లిపోదామా అని చూస్తున్న సుకుమార్‌ అనుకోకుండా ఆ ఊరి ప్రజల సమస్యలను తీర్చే ఊరిపెద్దగా ఆయన్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత తను ఏంచేశాడు? తననుకున్న ఆస్తి దక్కిందా?లేదా? అన్నది సినిమా.

నటీనటులు : ఆది నటనాపరంగా డాన్స్‌పరంగా బెటర్‌ అనే చెప్పాలి. గత రెండు చిత్రాల్లో ఈజీగా లాంగించేశాడు. ఈ చిత్రంలో పాత్ర కాస్త పలు షేడ్స్‌లో ఉంటుంది. దేన్నీ లెక్కచేయనివాడిగా, పెద్దమనిషిగా, అల్లరిచిల్లరిగా పలు కోణాలు ఈ పాత్రలో ఉన్నాయి. అయితే ఊరిపెద్దగా కృష్ణ పోషించిన పాత్రను ఆదిచేత చేయించడం వారసత్వంగావచ్చిందే అయినా దానికి సూట్‌కాలేదు. నటనలో ఇంకాస్త మెరుగు పర్చుకోవాలి. డైలాగ్‌ డెలివరీ పర్వాలేదు. కానీ.. ఎన్‌టి.ఆర్‌ చెప్పే యమసభ డైలాగ్‌ను మాట్లాడినా.. అంత ఎఫెక్ట్‌ అనిపించలేదు.

నిషా అగర్వాల్‌ పాత్ర రొటీన్‌గా హీరోను పడేయమటే కాన్సెప్ట్‌తో ఉన్నదే. అందులో ప్రత్యేకత ఏమీలేదు. బామ్మగా శారద చాలాకాలం తర్వాత తెరపై కన్పించింది. తాతగా కృష్ణ కన్పిస్తాడు. పాత్ర పరిమితమే. ఊరిలో దుష్టపాత్రగా తనికెళ్ళభరణి, రఘుబాబు పాత్రలు అలరిస్తాయి. హీరోకు స్నేహితులుగా ఉన్న బ్యాచ్‌ పిల్లజమిందార్‌లో ఉన్న బ్యాచ్‌నే దర్శకుడు తీసుకున్నాడు.

టెక్నికల్‌గా ఈ చిత్రానికి ప్రధానమైన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. పల్లెటూరి అందాల్ని చక్కగా చూపించాడు. సంగీతపరంగా అనూప్‌ బాణీలు ఏమంత ఎఫెక్ట్‌గా లేవు. 'నీలాకాశంలో మెరిసే చందురుడివి' అనే పాట కాస్త మెలోడీగా ఉంది. ఎడిటింగ్‌కు చాలా పనికల్పించాడు. ఎక్కడ ఏ సన్నివేశంలో వస్తుందో అర్థంకాకుండా ఉంది. దాన్ని కటింగ్‌ చేయడానికి సాహసమే చేశాడనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే ప్రధాన లోపం. మాటలు అంత ఎఫెక్ట్‌గా లేవు. ప్రాసకోసం పాకులాడుతూ సన పెట్టిస్తాడు.

విశ్లేషణ : సినిమాను సినిమాగా తీయాలి. ముక్కలు ముక్కలుగా కథను చెప్పడంతో సుకుమారుడు డెప్త్‌పోయింది. ఏ సన్నివేశం బాగోదు. కొత్తగా మెగాఫోన్‌ పట్టుకున్న వ్యక్తి చేసినట్లుగా ఈ చిత్రముంది. పిల్లజమిందార్‌ అనే చిత్రం ఓ మలయాళ రీమక్‌ కనుక దాన్ని చక్కగా డీల్‌ చేశాడు. అదే సుకుమారుడుకు వచ్చేసరికి అసలు స్టఫ్‌ బయటపడింది. దర్శకుడు ఎక్కడా మెప్పించలేకపోయాడు.

కథ కూడా అదే పాట్రన్‌లో ఉంటుంది. పిల్లజమిందార్‌లో... జల్సాగా తిరుగుతూ ఉన్న నానికి తాత తన ఆస్తి కోసం మనవడు బాగుపడితే గానీ ఇవ్వరాదని వీలునామా రాస్తాడు. సుకుమారుడులో.... విదేశీ వ్యామోహంలో బిజినెస్‌ కోసం డబ్బు కావాల్సి వస్తే... ఆస్తికోసం ఇండియా వస్తే.. వీడు తగినవాడా కాదా? అని బామ్మ టెస్టింగ్‌ పెడుతుంది. ఈ కథ నాగార్జున నటించిన గ్రీకువీరుడుకు డిటోనే. ఇద్దరు దర్శకులకు ఒకే ఐడియా రావడం కామనే అయినా.. దాన్ని తీసే విధానంలో ఇంకాస్త ఎఫెక్ట్‌ పెడితే బాగుండేది.

విలేజ్‌ వచ్చాక హీరోతో పాటు అతని గ్యాంగ్‌ చేసే హడావుడి ఎక్కడా నవ్వు తెప్పించదు. ప్రతి సన్నివేశం ముక్కలుముక్కలుగా డ్రామా చూస్తున్నట్లుంది. ఇటువంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకోవడం కష్టమే. ఆదికి మొట్టమొదటి ప్లాప్‌ సినిమా అవుతుంది. దర్శకుడికి ఓవర్‌ కాన్‌ఫిడెన్స్‌కు బ్రేక్‌ ఇచ్చే సినిమా అవుతుంది. నిర్మాతగా సుందరకాండ వంటి మంచి చిత్రాలను తీసిన బేనర్‌కు ఇది మచ్చగా మిగిలిపోతుందని అనుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి