నక్సలిజం నేపధ్యంగా సాగే "విరోధి"

శుక్రవారం, 1 జులై 2011 (18:55 IST)
WD
నటీనటులు: శ్రీకాంత్‌, శివాజీరాజా, అజయ్‌, కమలినీముఖర్జీ తదితరులు; కెమెరా: హెచ్‌.ఎం. రామచంద్ర, సంగీతం: ఆర్‌.పి. పట్నాయక్‌, నిర్మాత: మేక అనిల్‌, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: నీలకంఠ.

పాయింట్‌: విప్లవం ముసుగులో అతిచేసే ఓ వర్గం కథ.

నక్సలిజంపై చిత్రాలు చాలానే వచ్చాయి. సింధూరం నుంచి పలు చిత్రాలు నక్సలిజం, రాజకీయాన్ని బాల్యలెన్స్‌ చేస్తూ తీశారు. నీలకంఠ చేసిన కొత్త ప్రయోగం నక్సలిజంలోనూ ఉంది మనుషులే.. వారిలోనూ మానవత్వం ఉంది. అది కప్పిపుచ్చి అహం, ఆధిపత్యం కోసం సాగే పోరులో క్యాడర్‌ను కూడా సమిథలు చేసే ఓ వ్యక్తి కథను తీసుకున్నాడు నీలకంఠ.

కథ: రూ.4 వేల జీతం టీచర్‌స్థాయి నుంచి కోట్లు సంపాదించిన ఎంపీకి ఎదిగిన జంగయ్య (ఆహుతిప్రసాద్‌)ను నక్సల్స్‌ హత్య చేయడంతో కథ ప్రారంభమవుతుంది. జంగయ్య అరాచకాలను ఎండగట్టే జర్నలిస్టు జయదేవ్‌. తనపై వచ్చిన రాతలను మార్చేయమని ఇంటికి పిలుస్తాడు. ఇదే టైమ్‌లో నక్సలైట్లు వచ్చి దాడి చేసి జంగయ్యను చంపేస్తారు. అక్కడే ఉన్న జయదేవ్‌ను కిడ్నాప్‌ చేస్తారు. నక్సల్‌ దళనాయకుడు గోపీ(అజయ్‌).

ఈ ఘటనతో కేంద్రప్రభుత్వం ఎలర్ట్‌ అయి జర్నలిస్టు ప్రాణాలకు ముప్పు రాకుండా చూసుకోమని రాష్ట్రానికి చెబుతుంది. పోలీస్‌ కమీషనర్‌ నాగినీడు దీన్ని డీల్‌ చేస్తాడు. కిడ్నాప్‌ చేసిన జయదేవ్‌ను తమవెంట అడవులు కొండలు తిప్పిస్తారు. కాల్పుల్లో గోపీ గురువు నక్సలిజం పెద్దనాయకునికి తీవ్ర గాయాలవుతాయి. గోపీ టీమ్‌లో ఆవకాయ్‌ బిర్యానీ ఫేమ్‌ కమల్‌ కామరాజు, శివాజీరాజా, రవివర్మ ఉంటారు. గ్రూప్‌లో మహిళలు కూడా ఉంటారు.

తమ సిద్ధాంతం ప్రకారం జయదేవ్‌ను చంపాలని గోపీ నిర్ణయిస్తాడు. దీన్ని నక్సలిజంలోని కొన్ని గ్రూపులు వ్యతిరేకించి... గోపీని హెచ్చరిస్తాయి. అవేవీ పట్టించుకోని గోపీ రెండు రోజుల వ్యవధి అడుగుతాడు. ఈ రెండురోజుల్లో జయదేవ్‌ ఆ దళ సభ్యుల్లో అంతర్లీనంగా దాగివున్న మానవత్వాన్ని బయటపెట్టి సమాజంలోకి వెళ్ళేలా ఎలా చేశాడు అన్నది సినిమా.

WD
అసలు ఇటువంటి పాయింట్‌ ఎంచుకోవడమే దర్శకుని గుండె ధైర్యానికి హ్యాట్సాప్‌ చెప్పాలి. విప్లవం అంటే ఏమిటి? అందులో ఆధిపత్యం, ఇగోలు ఎలా ఉంటాయి. ప్రతి చోటా ఉన్నట్లే నక్సలిజంలోనూ అవి ఎలా ఉన్నాయి. దాన్ని తమ స్వార్థంకోసం దళ నాయకుడు సభ్యుల్ని ఎలా వినియోగించుకున్నాడు? వారిని ఎలా ఉద్రేగకపర్చి వాడుకుంటున్నానన్నది దర్శకుడు సామాన్యుడికి తెలియజేసే ప్రయత్నం చేశాడు.

నక్సలిజంలోకి యువతను రాబట్టడటానికి ఓ వ్యక్తి తండ్రి దళనాయకులు చంపేసి దాన్ని పోలీసులపై నెట్టేసిన ఉదంతం... వంటివి పోరాటం కోసం నక్సలైట్లు ఎన్ని అకృత్యాలకైనా పాల్పడాతారని వేలెత్తి చూపాడు. ఇవి అసలు పోరాటం చేసేవారికి కాస్త మింగుడు పడకపోవచ్చు. అన్ని దళాల్ని విమర్శించకోయినా నక్సలిజం ఇలా ఉంటుందా? అని తెలియజేశాడు.

ఇందులో పాత్రలన్నీ బాగా చేశాయి. అజయ్‌ పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉంది. కమలినీ ముఖర్జీ, శ్రీకాంత్‌ భార్యభర్తల పాత్రలు సామాన్యంగా ఉన్నాయి. ఎక్కువ భాగం సంభాషణలపై ఇటువంటి చిత్రాలు ఆధారపడి ఉంటాయి. అవి అంత పవర్‌ఫుల్‌గా అనిపించలేదు. విప్లవం పేరుతో అఘాయిత్యాలు చేస్తే అది పోరాటం అవ్వదని చెప్పాడు. శ్రీశ్రీ అన్నట్లు.. 'ఏది నిజం?' అనే తన కవితలో ఏది నిజం. ఏది సత్యం. ఏది నిత్యం, ఏది అసత్యం... వంటి పాటను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు అల్లిన కథలా ఉంది. అందుకు శ్రీశ్రీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ... వేసిన స్డైడ్ నిదర్శనం. ముగింపులో కూడా... తను అనుకున్న సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ఒక్కడైనా చాలు అన్నట్లు... దళసభ్యులందరూ చనిపోయినా ఒకే ఒక్కడు ముందుకు సాగిపోవడం... ఇంకా నక్సలిజంలో మంచివారు ఉన్నారనేందుకు ఉదాహరణగా చెప్పారు.

కెమెరా పనితం, నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎక్కువభాగం కొండలు కోనల్లో తీయడం ఈ చిత్రం ప్రత్యేకత. ఇది చాలా సీరియస్‌ టాపిక్‌. అంతే సీరియస్‌గా ఇటువంటి చిత్రాలు చూసేవారికి నచ్చుతుంది. అందరినీ అలరించే కమర్షియల్‌ చిత్రం మాత్రం కాదు. అవార్డు కోసం ప్రయత్నిస్తే రావచ్చు.

వెబ్దునియా పై చదవండి