మల్టీస్టారర్ చిత్రంగా "చందమామ"

శనివారం, 8 సెప్టెంబరు 2007 (12:01 IST)
WD PhotoWD
నటీనటులు: నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధుమీనన్, నాగబాబు, ఆహుతిప్రసాద్, ఉత్తేజ్, రాజేష్. జీవ, అభినయశ్రీ తదితరులు.

సాంకేతిక సిబ్బంది: బేనర్: తేజసినిమా, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, మాటలు: లక్ష్మీగోపాల్, కథ: ఆకులశివ, సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్, నిర్మాత: సి.కళ్యాణ్, ఎస్. విజయానంద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ: కృష్ణవంశీ.

నిజంగా చందమామలాంటి కథే. కానీ కృష్ణవంశీ చెప్పే విధానంతో కొంత గందరగోళం కన్పించింది. ఓ గ్రామంలోని కామందు ఎస్.వి.రంగారావు (నాగబాబు), ఆయుర్వేదం గొప్పతనాన్ని చాటిచెప్పే వ్యక్తి అతను. అతనికి మహాలక్ష్మీ (కాజల్ అగర్వాల్) అనే కూతురుంటుంది. భార్యలేదు. ఆయుర్వేదమంటే ఇష్టపడే శిష్యులుంటారు. అది గ్రామం కదా... అందుకే పట్టణంలో పై చదువులు చదివించడానికి ఆమెను పంపిస్తాడు తండ్రి. అదే ఊరిలో మరో భూస్వామి రామలింగేశ్వరరావు (ఆహుతి ప్రసాద్) కుమారుడు దొరబాబు (శివబాలాజీ) కూడా అక్కడే చదువుతాడు.

చదువు పూర్తయ్యాక తిరిగి గ్రామానికి ఇద్దరూ వస్తారు. వారు రాగానే ఇద్దరినీ ఒకటి చేయాలనేది పెద్దల తాపత్రయం. అన్నట్లుగానే నిశ్చితార్థంవరకు తీసుకెళతారు. కానీ మహాలక్ష్మీ మనస్సులోని మాటను దొరబాబుకు ఓ రోజు చెబుతుంది. తాను పట్టణంలో చదువుతున్నప్పుడే ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ కిషోర్ (నవదీప్)తో ఏర్పడిన పరిచయం తనను తాను అర్పించుకునే స్థాయికి వెళ్లిందనే విషయాన్ని చెబుతుంది.

కానీ అతను తనను ప్రేమించడంలేదనీ కేవలం కోరిక కోసమే అప్పుడప్పుడు దగ్గరకు రమ్మన్నాడనీ, దీంతో అసహ్యంతో ఈ ఊరు వచ్చానని విశదపరుస్తుంది. దీంతో బాగా ఆలోచించి ఈ విషయాలు పెద్దలకు తెలీయకుండా మేనేజ్‌చేస్తూ దొరబాబు ఏంచేశాడనేది మిగిలిన కథంతా. ఇందులో సింథుమీనన్ పాత్ర ఏమిటి? అనేది కూడా చూసి తెలుసుకోవాల్సిందే.

ఒకరకంగా ఇది మల్టీస్టారర్ చిత్రమనే చెప్పాలి. నవదీప్, శివబాలాజీలు ఇద్దరూ విడివిడిగా హీరోలుగా చేసిన వాళ్ళే. కానీ వాళ్ళకు ఇంతవరకు సరైన హిట్ రాలేదు. అందుకనేమో ఇద్దరినీ కలిపి కృష్ణవంశీ తీశాడనిపిస్తుంది. ఆయనకూ ఈ మధ్య పెద్దగా హిట్‌లు లేవు. మొత్తంగా నవదీప్, శివబాలాజీ నటనాపరంగా బాగా చేశారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పటి అమ్మాయిలా చాలా ఫాస్ట్‌గా ఉండే పాత్రలో సింధుమీనన్ నటించింది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రను బాగానే పోషించింది.

WD PhotoWD
గ్రామపెద్దగా హుందా అయిన పాత్రలో నాగబాబు సరిపోయాడు. ఆయన వియ్యంకుడిగా ఉన్న పాత్ర ఆహుతి ప్రసాద్ పోషించాడు. తొలిసారిగా తన పాత్రద్వారా హాస్యాన్ని పోషించాడు. ఒకప్పటి రావుగోపాలరూవును గుర్తు చేశాడు. రాధాకృష్ణన్ సంగీతం మెలోడి మహాత్యంవల్ల గత సినిమాల్లో ఉన్న ట్యూన్స్ లానే అనిపిస్తాయి. మొదటిభాగంలో కథలో లీనం చేస్తూ ఫాస్ట్‌గా సాగడంతో ఆకట్టుకునేటట్లుగా ఉంది.

కృష్ణవంశీ "మురారి", "నిన్నే పెళ్ళాడుతా" చిత్రాల తరహాలో సెంటిమెంట్‌ను పండించాలనుకుని సక్సెస్ కాలేకపోయాడు. మొదటిభాగంలోనే కథంతా తెలిసిపోయేసరికి ప్రేక్షకుడికి ట్విస్ట్‌ పోయింది. కిషోర్‌ను అసహ్యించుకుని వచ్చిన మహాలక్ష్మీ అవసరమైతే అతన్ని చంపస్తానంటుంది. కానీ ఓ సన్నివేశంలో కనిపించగానే చెంపలు వాయించి కావలించుకుంటుంది. ఇంకా ప్రేమ పెరుగుతుంది.

దీంతో... తాను మొదటిగా ఎవరికి జీవితాన్ని అర్పిస్తుందో జీవితాంతం వారితో స్త్రీ ఉండగలదు అనే విధానాన్ని గుర్తుచేసినట్లుంది. కానీ ఆమె ఎంతో ఎమోషనల్‌గా అసహ్యించుకుని చివరికి కలిసిపోవడం ప్రేక్షకుడికి కొంత కన్‌ఫ్యూజిగ్‌గా అనిపిస్తుంది. అంతకంటే కన్‌ఫ్యూజ్ మరోటి... మహాలక్ష్మీ వాంతి చేసుకుంటే... దీనికి కారణం కిషోర్‌ అని భావిస్తారు. కానీ తాను ఆరోజు ఏమీ చేయలేదనీ, అలాంటప్పుడు ఎలా కడుపు వస్తుందని గట్టిగా నవ్వేస్తాడు. చూసే ప్రేక్షకుడికి మాత్రం చిర్రెత్తుతుంది. ఇదంతా దర్శకుడి తప్పిదమే.