వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

శనివారం, 17 మే 2014 (18:46 IST)
WD
'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, శివన్నారాయణ, చంద్రమోహన్‌, వాసు ఇంటూరి, ఎల్‌.బి.శ్రీరామ్‌, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, కృష్ణ భగవాన్‌, పావనీరెడ్డి తదితరులు. బ్యానర్‌ : జస్ట్‌ ఎల్లో మీడియా ప్రై.లి, డిఓపి: రసూల్‌ ఎల్లోర్‌, ఎడిటింగ్‌: ధర్మేంద్ర, ఆర్ట్‌ : జె.కె.మూర్తి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ : శ్రీ, నిర్మాత : ఊర్మిళ గుణ్ణం, దర్శకత్వం : గంగరాజు గుణ్ణం.

విడుదల తేది: 17-05-2014
జస్ట్‌ ఎల్లో బేనర్‌ అనగానే వారంవారం వచ్చే 'అమృతం' సీరియల్‌ గుర్తుకువస్తుంది. సమకాలీన అంశాల్ని సెటెరిక్‌గా చూపించే ఈ సీరియల్‌ సంవత్సరాలుపాటు సాగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆరోసారి రిపీట్‌ అవుతుంది. దాన్ని నిర్మించిన గుణ్ణం గంగరాజు ఈసారి సినిమాగా మార్చారు. బుల్లితెర నటీనటులతోనే. కథ కూడా బుల్లి కథే. కానీ కొత్తగా చందమామలో సాగేలా చూపించాడు. మరి వారితో తెరకెక్కించిన చిత్రం 'చందమామలో అమృతం'. మరి చందమామపై అమృతం అండ్‌ టీమ్‌ ఏం చేశారో చూద్దాం.

కథ :
అమృతం (అవసరాల శ్రీనివాస్‌), అంజి ఉరఫ్‌ ఆంజనేయులు (హరీష్‌) మంచి స్నేహితులు. హైద్రాబాద్‌లో 'అమృత విలాస్‌' అనే హోటల్‌ను నడుపుతుంటారు. హోటల్‌ బిజినెస్‌ ద్వారా హెవీ లాస్‌లో ఉన్నవారు బెల్టు అప్పాజి (శివన్నారాయణ) అత్యాశ పుణ్యమా అని.. వంద కోట్ల ఆస్తిని సంపాదించుకొంటారు. వారి ఎదుగుదల చూసి కన్నుకుట్టిన అప్పాజి.. ఎలాగైనా వారిని బికారులుగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు.

అప్పాజి తెలివితేటలు, అమృతం-అంజిల అమాయకత్వం కలగలిసి.. 'చందమామ పై హోటల్‌ బిజినెస్‌' కాన్సెప్ట్‌తో.. వారిద్దరు ఎంతో కష్టపడి(వాళ్లకి తెలియకుండానే) సంపాదించిన రెండు వేల కోట్ల ఆస్తిని అమ్మేసి చందమామపైకి ప్రయాణమవుతారు. వారి ప్రయాణం సజావుగా సాగిందా..? చందమామపై జీరో గ్రావిటీలో జాలీగా గడుపుదామనుకొని అక్కడికి వెళ్లిన అమృతం అండ్‌ టీమ్‌ ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది చిత్ర కథాంశం.

అభినయం:
అవసరాల శ్రీనివాస్‌ 'అమృతం' పాత్రలో ఇమిడిపోయాడు. అతని అభినయం 'అష్టాచమ్మా' చిత్రాన్ని గుర్తు చేస్తుంది. ఆంజనేయులు పాత్రలో హరీష్‌ కోయలగుండ్ల చక్కని టైమింగ్‌తో ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా అతడు పలికిన అచ్చ తెలుగు సంభాషణలు బాగున్నాయి. అమృతం భార్యగా ధన్య ఫర్వాలేదనిపించుకొంది. ఆంజనేయులు భార్యగా నటించిన నటీమణి మధ్యతరగతి భార్యగా ఒదిగిపోయింది. సర్వర్‌ సర్వంగా వాసు ఇంటూరి జస్ట్‌ ఓకె. అంతరిక్షంలో ఇంజనీర్‌గా కృష్ణ భగవాన్‌, ఫ్యాక్షనిస్ట్‌గా ఆహుతి ప్రసాద్‌ తదితరులంతా పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :
రసూల్‌ ఎల్లోర్‌ కెమెరా పనితనం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాటలు-పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీ సంగీత, నేపధ్య సంగీతం కూడా సినిమాకి ప్లస్‌ అయ్యాయి. ముఖ్యంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ జె.కె. మూర్తి గురించి మాట్లాడుకోవాలి. స్పేస్‌ సెట్‌, ట్విన్‌ టవర్స్‌ లాంటి హోటల్‌ సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రాఫిక్స్‌ సినిమాకి మరో ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

విశ్లేషణ
లాజిక్కులు అంటూ కూర్చుంటే ఈ చిత్రం చూడ్డానికి ఏమీ ఉండదు. మైండ్‌లో ఏమీ పెట్టుకోకుండా థియేటర్‌కు వచ్చినవారికి ఈ చిత్రం నచ్చుతుంది. రొటీన్‌గా వస్తున్న ఒక ఫార్మట్‌ అనుకుని చిత్రాలు తీస్తున్న చిత్రాలకు భిన్నమైన కాన్సెప్ట్‌ ఇది. లిటిల్‌ సోల్జర్స్‌, అమ్మచెప్పింది వంటి కాన్సెప్ట్‌లతో కొత్తగా చూపించిన గంగరాజు ఇందులో అదే కొత్తదనం చూపించాడు. అయితే పిల్లలు ఎంజాయ్‌ చేసేందుకు కాస్త శ్రుతిమించిన హ్యూమర్‌గా ఉంది. అంతరిక్షంలో బెల్టు అప్పాజి పాత్రధారి శివన్నారాయణ చేసిన విన్యాసాలే అందుకు ఉదాహరణ. అంతరిక్షంలో యూరిన్‌ పోసుకోవాలంటే 'లక్ష' ఇవ్వాలనే ఏజెంట్‌ చెప్పిన విధానం నుంచి సాగే క్రమంలో కొంత సేపు ప్రేక్షకుడు నవ్వుతాడు.

ఇక ఈ చిత్రాన్ని తన భుజాలపై వేసుకొని.. కామెడీ సినిమాకి ఇంత బడ్జెట్‌ వర్కవుట్‌ అవదేమో అన్న ఆలోచన సైతం తన చెంతకు రానీయకుండా ఎంతో ధైర్యంతో ఈ ప్రాజెక్ట్‌కు టేకప్‌ చేసిన గుణ్ణం గంగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకొని తీరాలి. అసలు సీరియల్‌ను సినిమాగా తీయాలి అనే కాన్సెప్ట్‌ చాలా ప్రమాదకరమైనది. అందులోనూ స్టార్‌ కేస్టింగ్‌ అనేది లేకుండా ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌పై కోట్ల రూపాయల ఖర్చు, అందునా అత్యాధునిక ప్రమాణాలను వినియోగించి.. భారీ బడ్జెట్‌ చిత్రాల్లోని సి.జి వర్క్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రంలో 'చందమామ, అంతరిక్షం, రాకెట్‌' వంటి వండర్‌ఫుల్‌ ఫీట్స్‌ చేసారు.

6 అడుగుల స్థలంలో 5-6 అంతస్థుల హోటల్‌ కమ్‌ రెసిడెన్స్‌, అంతరిక్షంలో నాగలితో దున్ని వ్యవసాయం చేయడం, యువ జంటకు పెళ్ళి చేయడం వంటి ఐడియాలు గుణ్ణం గంగరాజు తెలివికి తార్కాణం. కొన్నిచోట్ల కామెడీ మరీ బోర్‌ కొట్టినా.. ధియేటర్‌ నుంచి బయటకు వచ్చేవారికి కొత్తగా అనిపిస్తుంది. తను చేసిన తప్పును ప్రేక్షకుడు కనిపెట్టాడనే కాబోలు... కృష్ణభగవాన్‌ పాత్ర చేత.. వీరికి వెండితెర ఇచ్చినా బుల్లితెర బుద్ధిపోలేదని డైలాగ్‌ చెప్పిస్తాడు. తన మీద తనే సెటైర్‌ వేసుకున్న గంగరాజును అభినందించాల్సిందే.

వెబ్దునియా పై చదవండి