"నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా".. లక్ష్యం కోసం పోరాడే హీరో (మూవీ రివ్యూ)

శుక్రవారం, 4 మే 2018 (12:38 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. బన్నీ తొలిసారి ఆర్మీ అధికారి పాత్రలో నటించారు. శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ చిత్ర కథ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం.
 
కథ విశ్లేషణ : 
సూర్య(అల్లు అర్జున్‌) భారత ఆర్మీలో సైనికుడిగా పని చేస్తుంటాడు. కోపం ఎక్కువ. చిన్న తప్పు జరిగినా తట్టుకోలేని మనస్తత్వం. హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సరిహద్దులకు వెళ్లి దేశసేవ చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఇంతలో పై అధికారులకు తెలియకుండా ఒక ఉగ్రవాదిని కాల్చి చంపేస్తాడు. దీంతో సైనిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సూర్యను ఆర్మీ నుంచి బయటకు పంపించాలని కల్నల్‌(బొమన్‌ ఇరానీ) నిర్ణయిస్తాడు. కానీ, అందుకు ఒప్పుకోని సూర్య తన గాడ్‌ ఫాదర్‌(రావురమేష్‌)ను రంగంలోకి దింపుతాడు. అంతా బాగానే ఉందని వైజాగ్‌లో ఉన్న సైకియాట్రిస్ట్‌ రఘురామ కృష్ణంరాజు(అర్జున్‌) దగ్గర సంతకం తీసుకొస్తే బోర్డర్‌కు పంపుతానని కల్నల్‌ చెబుతాడు. రామకృష్ణంరాజు 21 రోజుల సమయం ఇచ్చి, కోపం తగ్గించుకుని రమ్మని సూర్యకు చెబుతాడు. మరి ఆ ఛాలెంజ్‌లో సూర్య నెగ్గాడా? అతను బోర్డర్‌కి వెళ్లాడా? రఘురామ కృష్ణంరాజుకు సూర్యకు ఉన్న బంధం ఏంటి? అనేదే 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' పూర్తి కథ.
 
కోపాన్ని అదుపులో పెట్టుకోలేని ఓ సైనికుడి కథ ఇది. అల్లు అర్జున్‌ ఆ పాత్రలో ఇమిడిపోయారు. సూర్య పాత్ర కోసం బన్ని మారిన తీరు అభిమానులను సైతం ఆశ్చర్య పరుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానం సరికొత్తగా ఉంది. ఇక తొలి భాగంలో ట్రైలర్‌లలో చూపించినట్లు యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఆర్మీ ట్రైనింగ్‌ సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. పాత్ర కోసం బన్ని పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా ప్రారంభమవడమే హైపిచ్‌లో మొదలవుతుంది. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా, విరామం సమయానికి మళ్లీ కథలో వేగం పెరుగుతుంది. చిత్రం ప్రారంభానికి, విరామానికి, క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ సన్నివేశాలు చిత్రానికి ఎంతో హైలెట్‌గా ఉన్నాయి. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు బావుంది. కొన్ని కారణాల రీత్యా కోపాన్ని చూపించకుండా 21 రోజుల పాటు ఉండే పాత్రలో బన్ని చక్కగా ఒదిగిపోయాడు. అలాగే తొలి భాగం నుంచి ఫైట్స్‌, డాన్సులపరంగా బన్ని క్యారెక్టర్‌ను అద్భుతంగా పండించాడు. ఇప్పటివరకు చేసిన పాత్రలకంటే డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో బన్ని నటన ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఇక హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ పాత్ర గ్లామర్‌, పాటలకు మాత్రమే పరిమితం. 
 
ఇక సీనియర్‌ హీరో అర్జున్‌ సైకాలజీ ప్రొఫెసర్‌గా సరిగ్గా సరిపోయారు. ఇప్పటివరకు అర్జున్‌ చేయనటువంటి తండ్రి పాత్ర ఇది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో, ఇంటర్వెల్‌ ముందు బన్నితో చేసే డిస్కషన్స్‌ సీన్స్‌లో అర్జున్‌ తనదైన అనుభవాన్ని జోడించి చక్కగా నటించారు. ఇక హీరో శరత్‌కుమార్‌ విలనిజాన్ని ప్రారంభంలో చూపినట్లు చివరివరకు కొనసాగించలేక పోయారు. చిత్రం రెండో భాగంలో ముస్తఫా అనే మాజీ మిలటరీ సైనికుడి పాత్రలో సాయికుమార్‌ నటన బావుంది. ఇక నదియా, వెన్నెలకిశోర్‌, హరీశ్‌ ఉత్తమన్‌, బోమన్‌ ఇరానీ, రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, అన్వర్‌ అనే కుర్రాడి పాత్రలో నటించిన లగడపాటి శ్రీధర్‌ తనయుడు అందరూ వారి వారి పాత్రల పరంగా చక్కగా నటించారు.
 
టెక్నికల్ పరంగా... 
ఇక సాంకేతికంగా చెప్పాలంటే.. దర్శకుడు వక్కంతం వంశీ తొలి చిత్రం. ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ను అనుకుని దాని చుట్టూ కథ అల్లాడు. ఒక పక్క దేశభక్తి, హీరోయిజమ్‌, లవ్‌ ట్రాక్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్ని విషయాలను పక్కాగా సమకూర్చుకున్నాడు. అయితే ఇది ప్రీ క్లైమాక్స్‌ వరకు బాగానే ఉంది. హీరో క్యారెక్టర్‌ను దర్శకుడు డిజైన్‌ చేసుకున్న తీరులో ముగింపు ఇచ్చినా ఇంతకు ముందు చెప్పినట్లు అభిమానులకు, కామన్‌ ఆడియెన్‌ ఊహించినంత లేకపోవడం సినిమాకు మైనస్‌ అవుతుంది. ఇక రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ బావుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో చాలా బావున్నాయి. చిత్రం ప్రారంభంలో పోలీస్‌ స్టేషన్‌లో వచ్చే ఫైట్‌, ఇంటర్వెల్‌ ఫైట్‌, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయి.
 
బన్ని బాడీ లాంగ్వేజ్‌, క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేస్తాయి. విశాల్‌ శేఖర్‌ సంగీత బాణీలు వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. ఈ చిత్రంలో హీరోకు ఓ లక్ష్యం ఉంటుంది. కానీ కోపం ఎక్కువ. దాన్ని వదులుకుని తన క్యారెక్టర్‌ను చంపుకుని 21 రోజులు ఓ సైక్రియాటిస్ట్‌ సంతకం కోసం ఎంత కష్టపడ్డాడు. చివరకు ఆ సంతకం సంపాదించాడా? లేదా క్యారెక్టర్‌ కోసం నిలబడ్డాడా? అనేదే సినిమా. మొత్తంమీద హీరో లక్ష్యం కోసం పోరాడే సైనికుడి కథే ఈ చిత్రం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు