'జంటిల్‌ మెన్‌'లానే ఉన్నాడు... నాని జెంటిల్ మెన్ రివ్యూ రిపోర్ట్

శుక్రవారం, 17 జూన్ 2016 (13:11 IST)
జెంటిల్‌మెన్ నటీనటులు : నాని, సురభి, నివేదిత థామస్‌, అవసరాల శ్రీనివాస్‌, తనికెళ్ళ భరణి, రోహిణి తదితరులు. నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌, కథావిస్తరణ, దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి.
 
విడుదల: శుక్రవారం..17.6.2016
 
నాని చిత్రాలంటే నాచురల్‌ నటుడిగా ముద్రవేసుకునే కథలుంటాయని.. అలాంటివే ఎంపిక చేసుకుంటాడని తెలిసిందే. ఈసారి థ్రిల్లర్‌ ఎలిమెంట్‌ను టచ్‌ చేశాడు. పబ్లిసిటీలోనే హీరోనా? విలనా? అనే ట్విస్ట్‌ ఇచ్చి... థ్రిల్లర్‌ అంశమని చెప్పాడు. ఇక ఇంద్రగంటి మోహన్‌కృష్ణ.. నాని హీరోగా అష్టాచెమ్మతో చేశాడు. మరలా ఇన్నాళ్ళకు వీరిద్దరి కాంబినేషన్‌ కుదిరింది. దానికి ఆదిత్య 369.. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ తోడుకావడంతో క్రేజ్‌ వచ్చింది. మరి ఇందులో తను హీరోనా? విలనా? చూద్దాం.
 
కథ: ఐశ్వర్య (సురభి), నివేదిత థామస్‌ విమానంలో పక్కపక్కన సీట్లు. మాటల్లోనే మంచి ఫ్రెండ్స్‌గా మారిపోతారు. సముద్రాలు దాటి విమానం కిందికి దిగేలోపు.. ఒకరి ప్రేమకథ మరొకరికి చెప్పుకుంటారు. కట్‌చేస్తే గౌతమ్‌ (నాని) క్యాబ్‌ను నడుపుతుంటాడు. తొలిచూపులోనే నివేదిత థామస్‌ను ప్రేమించేస్తాడు. ఆమెను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా నివేదిత ఓ ప్రాజెక్ట్‌ పనిమీద లండన్‌ వెళుతుంది. అలాగే ఐశ్వర్య (సురభి) పెద్ద బిజినెస్‌మ్యాన్‌ కుమార్తె. జై.. ఉరఫ్‌ జయరామ్‌ (నాని) తనూ పెద్ద వ్యాపారవేత్త. ఉత్తమ అవార్డు పొందుతాడు ఓసారి. అక్కడే ఐశ్వర్య తండ్రి, జైను అల్లుడుగా చేసుకోవాలనుకుంటాడు. 
 
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
ఇద్దరికీ నచ్చుతుంది. ఇద్దరూ సరదాగా రెండురోజులు గడుపుదామని కొడైకెనాల్‌  వెళ్ళి.. అక్కడ చేతుల్లో డబ్బుల్లేకుండా గడపాలని ప్లాన్‌ చేసుకుంటారు. సక్సెస్‌ అవుతారు కూడా. ఇలా ఈ ఇద్దరి కథలు చెప్పేసరికి.. హైదరాబాద్‌ గమ్యస్థానం వచ్చేస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో తమ ఇద్దరికోసం తమ ప్రేమికులు వచ్చారని భావిస్తారు. కానీ.. జై.. ఐశ్వర్యను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది చూసి.. నివేదిత షాక్‌ అవుతుంది. వెంటనే.. గౌతమ్‌ ఇంటికి వెళితే తను యాక్సిడెంట్‌లో చనిపోయాడని గౌతమ్‌ తల్లి చెబుతుంది. అయితే.. ఆ తర్వాత ఓ జర్నలిస్టు వచ్చి.. నివేదితను ఇంటర్వ్యూ చేస్తూ గౌతమ్‌ను ఎవరో చంపారనే అనుమానాన్ని.. అది కూడా జై చేశాడని సందేహాన్ని వెలిబుచ్చుతుంది. దాంతో.. నివేదిత.. జై.. ఆఫీసులో ప్లాన్‌ ప్రకారం ఉద్యోగం సంపాదిస్తుంది. జై రహస్యాలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌: నటనాపరంగా నాని రెండు షేడ్స్‌ చూపించాడు. గౌతమ్‌ పాత్రలో ఎగువ మధ్యతరగతి పాత్రను ఈజీగా పోషించాడు. నివేదితను లవ్‌ చేసే క్రమంలో చూపించిన ఫీలింగ్స్‌ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా జై పాత్రలో ఒదిగిపోయాడు. స్టెయిలిష్‌గా నటన కనబర్చాడు. ఇక ఐశ్వర్యగా సురభి క్యాజువల్‌గానే నటించింది. గౌతమ్‌ లవర్‌గా మలయాళ నటి నివేదిత చేసిన పెర్‌ఫార్మెన్స్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రతి సన్నివేశాన్ని ఆకళింపుచేసుకుని చిన్నపాటి ఎమోషన్స్‌ను బాగా పండించింది. ఆశ్చర్యం, ఆనందం, విషాదం.. అనుమానం.. వంటి రసాలను బాగా రక్తికట్టించింది. రోహిణి గౌతమ్‌ తల్లిగా మాములు పాత్ర. అయితే.. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది అవసరాల శ్రీనివాస్‌ పాత్ర. తను జై.. ఆఫీసులో నమ్మకస్తుడు. తన పాత్రలోనూ రెండు షేడ్స్‌ వుంటాయి. ఇదికూడా స్టెయిలిష్‌గా చూపించాడు. ఇక మిగిలిన పాత్రలు మామూలే.
 
సాంకేతిక వర్గం:
కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. కొడైకెనాల్‌ అందాలు కనులవిందుగా కన్పిస్తాయి. క్యారెక్టర్‌ను ఇన్‌వాల్వ్‌ చేయడంలో సినిమాటోగ్రాఫర్‌ మలిచిన విధానం బాగుంది. దీనికి దర్శకుడు.. గైడెన్స్‌ బాగా కుదిరింది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పాటల్లో కన్పించింది. పాటలపరంగా చెప్పుకోదగినవి పెద్దగా లేవు. కథలో సాగిపోయేవి. సంగీతం కూడా ఒకే అనిపించేలా వుంది.. 
 
విశ్లేషణ:
ఇందులోని కథ మామూలు కథే. పాత రోజుల్లోనే చాలా సినిమాల్లో హీరోలు ఇద్దరు. అన్నదమ్ములుగా.. వుంటూనే.. సేమ్‌టుసేమ్‌గా వుండే పాత్రలను నాని చేశాడు. అయితే.. ఒకేలా వున్నా ఇందులో ఎవరికి ఎవరూ ఏమీకారు. కోట్లకు వారసుడైన వ్యాపారవేత్తను నమ్మకస్తుడు చంపేస్తే. ఆ ప్లేస్‌లో గౌతమ్‌ పాత్ర ఎంటరవుతుంది. ఆ తర్వాత తను విలన్‌ కాదని.. హీరో అని నిరూపించే కథాంశమే ఈ చిత్రం. 
 
నివేదిత.. జై.. పాత్రపై అనుమానం రావడం. దానికోసం అతని వద్దే పనిచేసి శోధించడం కథను కనెక్ట్‌ చేసింది. అయితే ముగింపు రొటీన్‌గా.. తెలుగు సినిమాలో వుండేలా చేసేశాడు. ఇంటర్‌వెల్‌లో ఇచ్చిన ట్విట్ట్‌ బాగుంది. ముగింపులో తను జైగా ఎందుకు మారాల్సి వచ్చిందో నివేదికకు చెప్పడంతోనే ముగింపు వస్తుంది. ఇదంతా పక్కనే వుండి విన్న ఐశ్వర్య రియలైజ్‌ అవుతుంది. ఆ వెంటనే గౌతమ్‌.. అమ్మ కూడా ఐశ్వర్య ఇంటికి వచ్చి కలిసిపోతుంది. ఇదంతా చకచకా జరిగిపోయాయి. ఇందులో పెద్దగా ట్విస్ట్‌ కన్పించదు. ముగింపు పేలవంగా చూపాడు. ఏతావాతా చెప్పాలంటే.. రెండు పాత్రలను హీరో చేస్తే అందులో చనిపోయిన ఓ పాత్ర  కుటుంబాన్ని కాపాడటం కోసం, ఇంకో పాత్ర ఎలా ప్రవర్తించిందనేది సినిమా. అయితే అక్కడక్కడ కొన్ని లాజిక్కులు కన్పించవు. జై లానే గౌతమ్‌ నటించినా... ఆఫీసు వ్యవహారాలో సంతకాలు ఎలా పెట్టాడో అర్థంకాదు. అలాగే జై.. తల్లికి కూడా తన కొడుకనే నమ్మేస్తుంది.
 
కొత్తదనంతో ప్రేమకథల్లో సాగే నాని చిత్రాల్లో ఇది కాస్త డిఫరెంట్‌గానూ వుంటుంది. మాస్‌, క్లాస్‌ ప్రేక్షకులను అలరిస్తుందనే చెప్పవచ్చు. మొదటిభాగంలో హీరో హీరోయిన్లతోనే ఎంటర్‌టైన్‌ చేయించిన దర్శకుడు రెండో భాగంలో వెన్నెల కిశోర్‌, రాజేష్‌ తదితరులపై చేసిన ఎంటర్‌టైన్‌ ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా కొత్త ప్రయోగం చేసి సక్సెస్‌ అయ్యాడు మోహనకృష్ణ.
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
రేటింగ్‌: 3/5 

వెబ్దునియా పై చదవండి