కరోనా తర్వాత కథల ఎంపికలో మార్పు వచ్చింది. అందులో భాగంగానే పరభాషా సినిమాలను కూడా రీమేక్ చేయడం కూడా సులువయింది. అలా కన్నడలో రూపొందిన `బీర్‌బల్` సినిమాను తెలుగులో `తిమ్మరుసు`గా రీమేక్ చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వున్న తిమ్మరసు సామాన్యులకు తన తెలివితేటలతో ఎలా న్యాయం చేశాడనేవి చరిత్రలో చాలా కథలున్నాయి. వాటిని ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్చి తీసిన సినిమానే ఇది. మరి అదెలావుందో చూద్దాం.
కథ:
బార్‌లో పనిచేసే అంకిత్ అనే యువకుడు చేయని నేరానికి ఎనిమిది ఏళ్ళు శిక్ష అనుభవించి తిరిగి ఇంటికి వస్తాడు. రామచంద్ర (సత్యదేవ్) ఔత్సాహిక లాయర్. లాను బాగా చదివిన రామచంద్ర న్యాయంవైపు వుండాలనే తత్త్వం. న్యాయవాదిగా నిలబడాలనే అతడికి సామాన్యులకు ఉచితంగా న్యాయసేవ అందించే ఓ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. తొలికేసుగా అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో చేయని నేరానికి ఎనిమిదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ కుర్రాడి కేసును అతను టేకప్ చేయాల్సివస్తుంది. ఇక అక్కడనుంచి రామచంద్రకు అన్నీ అడ్డంకులే. ముఖ్యంగా పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి అతనికి ఎదురైన సవాళ్ళను, బెదిరింపులను తట్టుకుని ఏవిధంగా తిమ్మరసులా తెలివిగా కేసును సాల్వ్ చేశాడనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
సస్పెన్స్, మర్డర్ కథలను ఆసక్తికగా చూపడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. ఇలాంటివే ఈమధ్య ఓటీటీ మాద్యమాల్లో తెగ వచ్చేస్తున్నాయి. చిన్న పాయింట్ తీసుకుని దాన్ని ఆసక్తి కలిగించేలా చేయడమే దర్శకుడి ప్రతిభ. అందుకే తొలిసారి దర్శకుడుగా నిలబడాలనే ఆల్‌రెడీ కన్నడలో విజయవంతమైన బీర్‌బల్‌ను తీసుకున్నాడు కాబట్టి ఏమాత్రం మార్పులు చేయకుండా యథాతథంగా తీసేశాడు. ఆ సినిమా చూసినవారికి ట్విస్ట్ పెద్దగా అనిపించదు. కానీ తెలుగులో నటీనటులు ఎలా నటించారనేది ముఖ్యం.
రామచంద్రగా లాయర్ పాత్రలో సత్యదేవ్ బాగా నటించాడు. ఆయనకు తోడుగా అతని ప్రేయసి ప్రియాంక, అసిస్టెంట్‌గా బ్రహ్మాజీ ఎంటర్‌టైన్ చేశాడు. చేయని నేరానికి శిక్ష అనుభవించిన కథలు చాలానే వచ్చాయి. కేబ్ డ్రైవర్ కేసును ఎందుకు ఆసక్తికగా లాయర్ టేకప్ చేయాలనుకన్నాడనేది కథలో ట్విస్ట్. ఈ క్రమంలో లాయర్‌కు అడుగడుగునా సంభవించే అడ్డంకులు తన యుక్తితో ఎలా ఎదుర్కొన్నానేది సినిమా. అవి అప్పటికప్పుడు తనకు ఎదురయిన సంఘటనలను యుక్తితో ఎలా మలుచుకున్నానేది లాయర్ పాత్రలోని ప్రత్యేకం. పాత్రపరంగా సత్యదేవ్ బాగానే నటించాడు. ఎమోషన్స్ బాగానే పండించాడు.
- అయితే లాయర్లను, జడ్జిలను కూడా తమకు వ్యతిరేకంగా వాదిస్తే అధికారం, డబ్బు వున్న వారు ఏమైనా చంపడానికైనా వెనుకాడరనేది ఇందులోనూ చూపించారు. ఈ సినిమా విడుదలరోజే జార్ఖండ్‌లో మాఫియాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనున్న జడ్జిని ఆటోతో గుద్ది చంపేసిన సంఘటన దేశమంతా న్యూస్ రూపంలో తెలిసిందే. ఇక ఈ సినిమాలోనూ ముగిసిపోయిన కేసును శోధించే భాగంలో లాయర్ రామచంద్రను లారీతో ఏక్సిడెంట్‌కు గురిచేయడం వంటివి జరుగుతున్నవి కళ్ళకు కట్టినట్లు చూపించినట్లయింది.
- ఈ సినిమా ద్వారా పలు విషయాలను సామాన్యులకు అవగతమవుతాయి. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న అంకిత్ అనే వ్యక్తిని కాపాడేందుకు తన తల్లి ఊరిలో వున్న ఆస్తుల్ని సైతం అమ్మేయడం వంటివి లాయర్ ఫీజులు రూపంలో ఎంత దోచుకుంటారనేది కూడా చూపించారు.
- తను ప్రేమించిన లాయర్ రామచంద్రను కాపాడేందుకు ప్రియాంక ఏవిధంగా అవతలివారికి అనుకూలంగా వుంటుందనేది కూడా చూపించాడు.
- లాయర్ వృత్తిలో ఎవరిని నమ్మాలో నమ్మకూడదనేది విషయాన్ని కూడా చర్చించాడు.
- పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అవినీతిపరులు ఎలా వుంటారనేది అజయ్, ప్రవీన్ పాత్రలో చూపించాడు.
- మర్డర్ మిస్టరీ అంటే ఎన్ని కథలు వచ్చినా ఆసక్తిగానే వుంటుంది. అందుకే ప్రతి సన్నివేశంలో ఒక ట్విస్టో,లేదంటే మిస్సింగ్ ఎలిమెంటో ఉండటంతో ప్రేక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి పెరుగుతుంది. పూర్తిగా థ్రిల్లర్ రూపం సంతరించుకున్న తిమ్మరసు.. అసలు నేరస్థుడు ఎవరనే ఉత్కంఠను పెంచుతుంది. చివర్లో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పడంతో పాటు ఈ కేసుతో తనకున్న సంబంధమేంటో హీరో రివీల్ చేయడంతో కథ ముగుస్తుంది.
మొత్తంగా తిమ్మరసు ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది. కథలో ఉన్న మలుపులు.. కథనంలోని వేగం.. బ్రహ్మాజీ పాత్రతో పండించిన నవ్వులు.. సినిమాకు ప్లస్. థ్రిల్లర్లు.. సీరియస్ సినిమాలు చూసేవాళ్లకు తిమ్మరసు నచ్చుతుంది. మళ్లీ థియేటర్ల వైపు నడవడానికి ఇది మంచి ఛాయిసే.
- ఇక ట్యాక్సీవాలా లో చేసిన ప్రియాంక ఇందులో లావుగా కనిపించింది. నటించడానికి పెద్దగా ఏమీలేదు. చేయని నేరానికి హత్య కేసులో జైలు శిక్ష అనుభవించే కుర్రాడిగా అంకిత్ ఆకట్టుకున్నాడు. చైతన్యరావు.. ఝాన్సీ,అజయ్, ప్రవీణ్,హర్ష, బాలకృష్ణన్. వీళ్లంతా బాగానే చేశారు.
- కథా కథనాలు ఆసక్తికరంగా సాగడంతో ప్రేక్షకులు కొన్నిలోపాన్ని పట్టించుకోరు. పాటలు లేని ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్లస్ అయింది. థ్రిల్లర్ సినిమాలకు పేరు పడ్డ అతను ఉత్కంఠ రేకెత్తించే ఆర్ఆర్ తో సన్నివేశాల బలం పెంచాడు. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లో విడుదలైన తిమ్మరసు థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి నచ్చుతుంది.