చంద్రబాబు హీరో - నాదెండ్ల విలన్ :: ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ రివ్యూ
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (08:03 IST)
తెలుగువాడి కథ. మన అందరీ కథ.. ఇది మన కథ.. మా అమ్మానాన్న కథ.. అంటూ బాలకృష్ణ సంభాషణలతో ప్రారంభమైన 'మహానాయకుడు' చిత్రం మొదటి భాగం 'కథానాయకుడు'లో ఎన్‌టిఆర్. ఎలా నటుడయ్యాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ప్రేరణ ఏమిటనేది చూపించాడు. ఇక రెండో భాగంలో రాష్ట్రంలోకాక దేశంలోనూ మహానాయకుడిగా ఎలా ఎదిగాడనే కోణంలో చూపించారు. అందరూ ఊహించినట్లు, సోషల్ మీడియాలో పెద్ద చర్చోపచర్చలుగా మారిన చంద్రబాబు పాత్రను ఎలా చూపించారనే ఆసక్తి ఈ చిత్రం చూస్తే పటాపంచలవుతుంది. అదెలాగో కథలోకి వెళదాం.
కథ:
రామారావు భార్య బసవతారకం కేన్సర్‌సోకి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటుంది. హరికృష్ణ (కళ్యాణ్‌రామ్) తెచ్చిన ఆల్బమ్‌ను చూస్తూ గతంలోకి వెళుతుంది. అది 'కథానాయకుడు' కథ. ఆ తర్వాత రామారావు పార్టీ పేరు ప్రకటించి పార్టీకి గుర్తును ప్రకటిస్తాడు. ఆ తర్వాత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్ర తరహాలో చైనత్యరథంలో ప్రయాణం చేస్తాడు. ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఇది అధికార పార్టీ కాంగ్రెస్‌కు మింగుడుపడదు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన ఇగోతో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చేస్తుంది. దాన్ని బ్రహ్మాస్త్రంగా రామారావు మార్చుకుంటాడు. చివరికి ముఖ్యమంత్రి అవుతాడు. తను హామీలిచ్చిన పనులన్నీ చకచకా కార్యరూపం దాల్చడం అవినీతి మంత్రుల ఇళ్ళపై ఐటీ దాడులు నిర్వహిస్తాడు. దానికి వారంతా కాంగ్రెస్‌లో వున్న స్వాతంత్ర్యం ఇక్కడలేదని నాదెండ్ల భాస్కర రావుకు చెప్పడంతో అతను ఏవిధంగా వారిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఎటువంటి కపట నాటకం ఆడాడు? చివరికి అధిష్టానం ఏవిధంగా తలొగ్గింది? అనేదే ఈ చిత్రం కథ.
విశ్లేషణ:
ఈ చిత్రం అప్పటి రాజకీయ చిత్రాలకు నిదర్శనం. ఎక్కడా కల్పితం లేకుండా జరిగిన విషయాన్ని తెరపై ఆవిష్కరించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి, గవర్నర్, వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర రావులు విలన్లు. వారిని ప్రజల అండతో రామారావు ఎలా ఎదుర్కొన్నాడు. అందుకు దారితీసిన పరిస్థితులే ఈ చిత్రం. తన మామకు వెన్నుపోటుపొడిన నాదెండ్ల భాస్కర రావుకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ఎలా తన మైండ్‌గేమ్‌తో గట్టెక్కించాడనేది ఆసక్తికరంగా వుంది. ట్రైలర్‌లో తన చూపుల్తో విలన్‌గా అనిపించేలా చంద్రబాబు వున్నా తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మామగారికి ముఖ్యమంత్రి పీఠం గిఫ్ట్‌గా ఇచ్చేందుకు తోడ్పడిన నిజాయితీపరుడుగా పాత్ర చిత్రీకరణ జరిగింది. ఆ పాత్రను దగ్గుబాటి రానా పోషించాడు.
'యాత్ర' సినిమాలోనూ వై.ఎస్. అధిష్టానం పొగరు అణచినట్లుగానే ఇందులోనూ రామారావు అణిచాడు. కానీ ఎన్నో ఏళ్ళకు ముందే దానికి బీజం పోసిన వ్యక్తిగా చరిత్రలో రామారావు నిలిచాడు. ఆయన ప్రజల క్షేమం కోసం పెట్టిన పథకాలే నేటికీ ప్రభుత్వాలు మారినా రకరకాల పేర్లతో కొనసాగించడం విశేషం. రెండు రూపాయల కిలో బియ్యం, పేదలకు వైద్యం, కొడుకులతోపాటు సమానంగా కూతుళ్ళకు ఆస్తిరాసి మార్పు తన ఇంటినుంచే ప్రారంభించడం వంటివి ఆకట్టుకున్నాయి. ప్రజల సాధక బాధకలు స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన చైతన్య రథయాత్ర బాగుంది. 'తెలుగు దేశం ప్రచారంలో ఇంత స్పందన వుంటే అధికారంలోకి వస్తే ఇంకెలావుంటుంది' వంటి ఎన్నో సంభాషణలు సందర్భోచితంగా వున్నాయి. పాలిటిక్స్‌లో అందరినీ కలుపుకుని పోవాలి. సినిమాల్లో ఏ స్వార్థంలేని పొగడ్తలు వినివుంటారు. ఇంకా ఇక్కడ అంతా స్వార్థమే.. విన్నటుంటారు. కానీ వినరు. ఇంటిలోవాడిగా చెబుతున్నాననే చంద్రబాబుడైలాగ్ బాగుంది.
అప్పట్లో రామారావు చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రతిష్టాత్మకమైనవే. తమిళనాడు తాగునీరు మనకు సాగునీరునిచ్చే తెలుగుగంగ ప్రాజెక్ట్. బానిసత్వం ప్రోత్సహించే పట్వారీ వ్యవస్థ రద్దుచేయడం, రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్నారంటూ ప్రధానిమంత్రిపై ఎలుగెత్తి చాటడం, మా హక్కులు సాధించేవరకు నిద్రపోను ఢిల్లీని కూడా నిద్రపోనివ్వను శపథం చేసి ప్రధాని నిరంకుశత్వాన్ని ధిక్కరించిన మొదటి వ్యక్తి ఎన్‌టిఆర్. సహధర్మచారిణి అనుమతితో కాషాయం కట్టుకుని ప్రజలకు సేవచేయడం వంటివి ఆయనలోని ఉన్నతత్వానికి నిదర్శంగా చెబుతాయి. ఎన్ని పనులు ప్రజలకు చేసినా మొసలి వంటి వ్యక్తులు తన పార్టీలో వుంటే ఎలాంటి పరిణామాలు వుంటాయనేది నాదెండ్ల పాత్ర ద్వారా చూపించాడు. రాజకీయాల్లో పదవీ వ్యామోహనం ఎలా వుంటుంది. దాన్ని అధికారంతో దుర్వినియోగం ఎలా చేయవచ్చో గవర్నర్ పాత్ర నిదర్శనం. ఇలా అప్పటి పరిస్థితుల్ని కూర్చి వెండితెరపై ఆవిష్కరించిన ఈ 'మహానాయకుడు' రెండోసారి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనేదే కథాంశం. దాంతో ముగింపు కార్డ్ పడుతుంది.
అయితే ఈ పరంపంరలో ఎటువంటి ట్విస్ట్‌లు వుండవు. పెద్దగా పీలయ్యే సన్నివేశాలూ వుండవు. అంతా ఏదో డాక్యుమెంటరీ చూస్తున్నట్లు టకటకా పాత్రలు వచ్చిపోతుంటాయి. సన్నివేశాలు అంతే స్పీడ్‌గా చూపించేయడంతో కథలోని పట్టు కన్పించదు. పాత్రపరంగా ఎన్‌టిఆర్ పాత్రను బాలకృష్ణ పండిచాడు. చంద్రబాబుగా రానా పండించాడు. మిగిలిన పాత్రలు పేర్లుబట్టి ఈ పాత్ర ఇతనా అనేట్లుగా మనం ఊహించుకోవాలి.
ఫైనల్‌గా ఈ చిత్రం కేవలం తన మామను చంద్రబాబు ఎలా రక్షించాడనేందుకు తీసినట్లుంది. అందుకే అందులో చూపించినట్లుగానే ప్రస్తుతం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం అంటూ హూంకరిస్తున్నాడు. మరి ఈ చిత్రంలో తనను విలన్‌గా చూపిస్తే ఊరుకునేది లేదని కబుర్లు చెప్పిన నాదెండ్ల నిజస్వరూపం చూశాక ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే. మరోవైపు వర్మ చిత్రానికి దీనికి సంబంధంలేదని తేలిపోయింది. ఆయన చంద్రబాబును విలన్‌గా చూపించబోతున్నాడు. అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందే తెలియాల్సివుంది. ఏదిఏమైనా మహానాయకుడు చిత్రం చూసినా తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయనే గ్యారంటీ లేదు.
ఈ విశ్లేషణ ప్రేక్షకుడి దృష్టికోణం నుంచి రాయడం జరిగింది.