రాంగ్ గోపాల్ వర్మ చిత్రం RGVని పట్టి చూపించిందా? రివ్యూ
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (16:21 IST)
కరోనా సమయంలో చిత్రపరిశ్రమ అంతా షూటింగ్‌లకు దూరంగా వుంటే.. ఒక్క రాంగోపాల్ వర్మ మాత్రం ఏదో ఒకటి కామెంట్‌లు చేస్తూ.. పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. వర్మది చిత్రమైన ధోరణి. విచిత్రమైన పద్ధతి. తన నోటికి ఏది వస్తే అది అనేస్తుంటాడు. ఆ తర్వాత దాని గురించి అడిగితే.. అప్పుడు అలా అన్నా.. ఇప్పుడు ఇలా అంటున్నానంటూ చాలా సందర్భాల్లో మీడియాకే చెప్పాడు.
తెలుగులో ఇకపై సినిమా తీయనని అప్పట్లో స్టేట్‌మెంట్ ఇచ్చి బాలీవుడ్ వెళ్ళిపోయాడు. అక్కడ అమితాబ్‌తో సినిమాలు తీసి మాఫియా డ్రామాలు తెరక్కించి.. చివరికి తిరిగి టాలీవుడ్ వైపు వచ్చాడు. ఇక సమాజంలో ఏదో ఒక చర్చ జరిగితే.. దానికి వర్మ కామెంట్ పెడుతూ దానికి ఆజ్యం పోస్తాడు. ఆ మధ్య శ్రీరెడ్డి విషయంలోనూ అదే తీరు.. తనకు అన్యాయం జరిగిందని.. అర్థనగ్నంగా.. ఫిలింఛాంబర్‌లో నిరసన తెలిపితే ఆమెలో ఓ ఝాన్సీలక్ష్మీభాయ్‌ను చూస్తున్నానంటూ సెటైర్లు వేశాడు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు ఆయనలో వున్నాయి. ఆఖరికి పవన్ కళ్యాన్ పైనా, ఎన్‌టి.ఆర్. పైనా కూడా సినిమాలు తీసి తన దర్శకత్వ తాపాన్ని తీర్చుకున్నాడు. శివ సినిమా తర్వాత నుంచి అతన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది యువ దర్శకులు తెలుగు పరిశ్రమకు వస్తే... ఇప్పుడు ఆయన పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అసలు ఇలా ఎందుకు మారాడు? ఎలా వుంటే బాగుంటుంది? అనే కోణంలో ఆలోచించి.. జర్నలిస్టు అయిన ప్రభు కలం నుంచి వచ్చి మాటలు, దాసరి శిష్యుడిగా ఆయన చేపట్టిన దర్శకత్వంలో వచ్చిన సినిమానే రాంగ్ గోపాల్ వర్మ. ఇది 42 నిముషాల ఇండిపెండెంట్ ఫిలిం. ఈరోజే శ్రేయాస్ ద్వారా విడుదలయింది.
కథ..
దర్శకుడు రాజ్‌గోపాల్ వర్మ(షకలకశంకర్) దగ్గరకు అసిస్టెటెంట్‌గా పనిచేయడానికి కత్తి మహేష్, హైపర్ ఆది వస్తారు. రాగానే గోడపై వున్న పలు రకాల ఫొటోలను చూసి ఆశ్చర్యపోతుంటే.. వర్మ వచ్చి వారికి వివరిస్తాడు. ఆ తర్వాత వర్మ పదేళ్లలో తీసిన సినిమాలు, ఆయన చేసుకున్న పబ్లిసిటీకి సెటైర్‌గా అతనో సైకో, కామాంధుడు అంటూ రకరకాలుగా యూట్యూబ్‌లో వస్తుంటాడు. అవి చూస్తున్న తన అసిస్టెంట్లను బయటకు గెంటేస్తాడు.
ఇలా అందరూ దూరం అయి ఒంటరిగా వున్న వర్మకు.. ఆయన అంతరాత్మ వచ్చి.. ఎలాంటివాడివి ఎలా అయ్యావని విశ్లేషిస్తూ... చురకలు వేస్తుంది. ఇవన్నీ డైలాగ్ రూపంలోనే వుంటాయి. చివరికి ఆ అంతరాత్మ రూపంలో వచ్చింది దర్శకుడు ప్రభు. ఇలా కళామతల్లికి వర్మ చేసిన ద్రోహానికి ఎలాంటి తీర్పు ఇచ్చాడనేది ముగింపు.
వర్మ గురించి ప్రజలు, సినిమా వాళ్లు ఏమనుకంటున్నారో అనేదానికి ప్రభు ఇచ్చిన డైలాగ్‌ల దృశ్య రూపం ఇది. ఒకే ఇంటిలో ముగ్గురు నటీనటులతో తెరకెక్కించిన ఈ డాక్యెమెంటరీ చూస్తుంటే... అప్పట్లో స్వర్గీయ జయప్రకాష్ రెడ్డి చేసిన అలెగ్జాండర్ నాటకం.. గుర్తుకు వస్తుంది. కాకపోతే అందులో తను ఒక్కడే వుండి కథను కళ్ళకు కట్టినట్లు చెబుతాడు.