మలుపు

గురువారం, 24 ఏప్రియల్ 2008 (12:37 IST)
ముక్కంటి కంఠంలోని నాగేంద్రుడిలా డాక్టర్ వినీల్ మెడలో స్టెతస్కోప్ వేలాడుతోంది. గడ్డం మీద చెయ్యి పెట్టుకొని కూర్చున్న అతని భంగిమ అతని దీర్ఘాలోచనకు చిహ్నంగా వుంది. అతని ఆలోచన యింకా ఎవ్వరూ పేషంట్లు ఎందుకు రాలేదా? అని మాత్రం కాదు."బాబు వినీల్! ఈరోజు నీకోమంచి సంబంధం చూశాను. నువ్వు నచ్చితే వివాహం చేసేందుకాయన సిద్దంగా వున్నాడు. రెండు మూడు రోజుల్లో ఆ అమ్మాయి మన ప్రక్క ఊరికి వస్తుందట. వాళ్ళ స్నేహితురాల్ని చూసేందుకు. అప్పుడు మనింటికి పంపమని చెప్పాను శంకరయ్యగారితో" అన్న తండ్రి మాటల్ని గురించి ఆలోచిస్తున్నాడు డాక్టర్ వినీల్.

"శంకరయ్యగారి ఏకైక కుమార్తె మమతను వివాహం చేసుకుంటే.. శంకరయ్యగారి ఆస్తంతా మమత ద్వారా సంక్రమిస్తుంది.. తద్వారా హైదరాబాద్‌లో ఒక మంచి నర్సింగ్ హోమ్ కట్టించి మంచిపేరుతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన వినీల్ మనస్సుని ఎంతో ఆనందపరుస్తోంది. అతని ఆనందాన్ని భంగపరుస్తూ..

"డాక్టర్ బాబూ! ఈ అమ్మాయికి పాము కరిచింది.." అంటూ గిరిజన గూడెంవాళ్ళు కొందరు ఒక యిరవై సంవత్సరాల యువతిని తీసుకువచ్చి బల్ల మీద పండబెట్టారు. ఆమె పరిస్థితి గమనించిన డాక్టర్ వినీల్...వెంటనే ఒక యింజక్షన్ ఇచ్చి "ఈమెను వెంటనే పట్నంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళండి. ఇక్కడ వుంటే కష్టం" అనేసరికి ..

"డాక్టర్ బాబూ! అసలీమెవరో మాకు తెల్వదు.. ఊరిపొలిమేరల్లో మేం సేద్యం చేసుకుంటుంటే కెవ్వుమన్న కేక విన్పించి అటు వెళ్ళేసరికి నురగలు కక్కుతూ పాము కరిచిందని చెప్పింది. .. మేము పట్నం తీసుకెళ్తే ..! "వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. "పట్నం తీసుకెళ్ళక నా నెత్తిన వేద్దామనుకుంటున్నారా! వెళ్ళండి." కసిరినట్లుగా మాట్లాడేసరికి "డాక్టర్‌గా కాకున్నా సాటిమనిషిగా మేం సహాయపడగలం" అనుకొని ఆమెను భుజాన వేసుకుని వెళ్ళిపోయారు.

డాక్టర్ వినీల్ కొద్ది శ్రద్ద తీసుకొని ఆమెను పరీక్ష చేసివుంటే ఆమెను బ్రతికించి వుండవచ్చు. కానీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని అనుకున్నాడు. కాబట్టి ఆమెను పట్నం పంపాడు. కాలం గడిచే కొద్దీ ఆమె బ్రతికే చాన్సు తగ్గుతుందని డాక్టర్ వినీల్‌కు తెలుసు.మరుసటి రోజు డాక్టర్ వినీల్‌తో అతని తండ్రి ..

"ఒరేయ్ అరుణ్! నిన్న పాము కాటుకు గురై హాస్పిటల్ కి వచ్చిన అమ్మాయిని సరిగ్గా ట్రీట్ చేయకుండా పట్నం ఎందుకు పంపావురా ..?ఈరోజు ఉదయం ఆ అమ్మాయి పట్నంలోని పెద్దాసుపత్రిలో ప్రాణాలు వదిలిందిరా" అంటూ విలపించేసరికి,
"నువ్వెందుకు నాన్నా? ఎవరినో గూర్చి విలపిస్తావు?".

"వెధవా! ఆ అమ్మాయి ఎవరో కాదురా శంకరయ్యగారి ఏకైక కూతురు. మమతరా ఆ అమ్మాయి. ప్రక్కవూరినుండి మనింటికే వస్తూ దారిలో పాముకాటుకు గురైందిరా" అంటున్న తండ్రి మాటలు సమ్మెటపోటుల్లా గుండెల్లో మార్మోగసాగాయి.

వెబ్దునియా పై చదవండి