భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగావుంది. ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డయాలసిస్ చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంతమేరకు కుదుటపడినట్టు ఎయిమ్స్ వైద్యవర్గాలు వెల్లడించాయి.
కాగా, సోమవారం రోటీన్ హెల్త్ చెకప్ కోసం వాజ్‌పేయిని సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.
అయితే, ఆయనకు డయాలసిస్ చేశాక.. ఆరోగ్యం కుదుటపడినట్టు సమాచారం. ఇదే అంశంపై మంగళవారం మధ్యాహ్నం వైద్య బులిటెన్‌ను విడుదల చేశారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు వాజ్‌పేయి స్పందిస్తున్నారని.. యాంటీబయాటిక్స్ కొనసాగిస్తున్నామని తెలిపింది. వాజ్‌పేయికి ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అయ్యేవరకు ఆస్పత్రిలో ఉంటారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.
కాగా, గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న వాజపేయి తాజాగా కిడ్నీ, ఊపిరితిత్తులు, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. దీంతో ఆయనను సోమవారం ఎయిమ్స్‌లో చేర్చారు. ఐసీయూలో చేర్చిన వైద్యులు డయాలసిస్ సేవలందిస్తున్నారని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.