నాని పైన విరక్తి కలిగింది.. ఆయన్ను ఆ ఇంట్లో బంధిస్తే పోయేది... ఎవరు?

గురువారం, 4 అక్టోబరు 2018 (19:02 IST)
బిగ్‌బాస్‌-2 ముగిసి విజేతను ప్రకటించాక… ఆ షోలోని లోపాలు, అసంమజసమైన వ్యవహారాలపై చర్చ జరుగుతోంది. కౌశల్‌ ఆర్మీ, సోషల్‌ మీడియాలో దాడి, బెదిరింపులు, ఓట్ల కొనుగోలు వ్యవహారం ఇలా అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. బిగ్‌బాస్‌ ఇంటిలో కంటెస్టెంటుగా 63 రోజుల పాటు ఉన్న మానవవాది, నాస్తికవాది బాబు గోగినేని బిగ్‌బాస్‌ను ఇప్పుడు కడిగిపారేస్తున్నారు. బిబిసి వెబ్‌సైట్‌కు ఆయన రాసిన వ్యాసంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఒక దశలో నాని వ్యవహరించిన తీరుతో ఆయనపైన విరక్తి కలిగిందని పేర్కొన్నారు. ఆయన్నూ బిగ్‌బాస్‌ ఇంటిలో బంధించి వుంటే…. ఈ షోను ఇంకా బాగా నిర్వహించి వుండేవారని గోనిగేని అభిప్రాయపడ్డారు.
 
‘బయట సైబర్‌ సైన్యాలను మోహరించుకొని వెళ్లారు కొంతమంది ఆటగాళ్లు! వారి సైన్యం పని ఏమిటంటే వేరే ఆటగాళ్లపై నేరపూరిత ఉద్దేశాలతో దారుణంగా దాడి చేయడం, మిగతా ఆటగాళ్లను సమర్థించే వారిని నేరపూరితంగా బెదిరించడం. దీప్తి సునయన, తేజస్వి లాంటి ఆడవారిని దుర్మార్గంగా దూషించడం… ఎవరినీ వదల్లేదు ఈ మూకలు. మిగతావారు కూడా ప్రొఫెషనల్‌ మార్కెటింగ్‌ ఏర్పాట్లు చేసుకొని వెళ్లారని తెలుస్తోంది. ఒక సైబర్‌ సైన్యం దాడి తట్టుకోలేక, పోలీస్‌ ఫిర్యాదులో బయటపడ్డది ఆ ప్రొఫెషనల్‌ మార్కెటింగ్‌ సంస్థ. ఇవన్నీ కట్టడి చేసే బాధ్యత నిర్వాహకులదే కదా? ఇలా చేయించిన ఆటగాళ్లను బయటకు పంపించాల్సిన బాధ్యత నిర్వాహకులది కాదా?’ అని ప్రశ్నించారు బాబు గోగినేని.
 
‘ఇంట్లో సభ్యులను ఒత్తిడికి లోనుచేస్తే వారి ప్రవర్తనను కెమెరాల్లో బంధిస్తే అది ఒక వినోద కార్యక్రమం అవుతుందని అందరూ అనుకున్నారు. మరి 90 కెమెరాలను, సోషల్‌ మీడియాను అందుబాటులో ఉంచి ప్రోగ్రాం హోస్ట్‌ను, నిర్వాహకులను ఒత్తిడికి, బెదిరింపులకు, దూషణకు గురిచేస్తే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వినోదం కాదు, విషాదం వస్తుంది. నాకు తెలిసి... నాని గారిని ఒత్తిడికి లోనుచేయకపోతే ఆయన ఆట ఇంకో విధంగా, గొప్పగా ఉండేది. నిర్వాహకులేమో బిత్తరపోయి చూస్తున్నారు. అసలు వీరిని కూడా ఇంటిలో బంధించి ఉంచితే ఆట బాగా ఆడేవారేమో! చాలా ఆసక్తికరంగా ఉండాల్సిన ఆటను, అందరూ కలిసి ఎలా దిగజారిపోయే అవకాశం ఇచ్చారో!’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గోగినేని బాబు.
 
‘3,500 డాలర్లకు కొన్ని పదుల వేల జీ-మెయిల్‌ ఖాతాలను కొనుక్కోవచ్చనీ, ఆ ఫీజు కడితే ఆ మార్కెటింగ్‌ సంస్థ వారే ఆ ఇ-మెయిల్‌ ఖాతాల నుంచి వోట్లు వేసి పెడతారనీ బయటకు వచ్చిన తాజా సమాచారం. అంటే, క్రికెట్‌ భాషలో చెప్పాలంటే "ఆట బుకీస్‌ చేతిలోకి వెళ్లిపోయింది”. ఇది రియాలిటీ షోగా ఉండాల్సింది సైబర్‌ వార్‌గా మారిపోయింది. ఈ ఆటలో ఆటగాళ్లు బిగ్‌ బాస్‌, ఇంటి సభ్యులు, ఆటను వీక్షిస్తూ వోట్లు వేస్తున్నవారు. వీరిలో కొంత మంది ఆటగాళ్లే ఈ ఆటను ఓడించారు. మరి ఈ పరిస్థితిలో ఎవరు గెలిచినట్లు? ఆట నియమాలను, ఆట స్ఫూర్తిని గౌరవించినవారే గెలిచినట్లు. మిగతావారు అందరూ ఓడినట్లే! అద్దంలో ముఖం చూసుకోండి!’ షో పట్ల ఒకింత అసహనంతో కూడిన అభిప్రాయాన్ని వెల్లడించారు.
 
‘బిగ్‌ బాస్‌ ఇంట్లో ప్రక్రియ ఏంటంటే, ప్రతి వారం ఇంటి సభ్యులు కొంతమందిని నెగటివ్‌ వోట్‌ ద్వారా నామినేట్‌ చేస్తే, ప్రేక్షకులు పాజిటివ్‌ వోట్‌తో ఎవరిని ఉంచాలనేది నిర్ణయిస్తారు. తక్కువ వోట్లు పడ్డవారు ఎలిమినేట్‌ అవుతారు. 
 
అప్పటికే ఎలిమినేట్‌ అయిన నూతన్‌ నాయుడు, శ్యామల అనే ఇద్దరిని వారితో టీవీలో కాంపెయినింగ్‌ చేయించి మళ్లీ ఇంట్లోకి తీసుకురావడం, వారు బయట నుంచి చూసిన విషయాలను కొంతమంది ఇంటి సభ్యులకు మాత్రమే చెవిలో చెప్పడం మొదలుపెట్టడం, ఈ కొత్త సమాచారం ఆధారంగా దీప్తి నల్లమోతు, గీతా మాధురి తమ ప్రవర్తనను మార్చుకోవడం, నాస్తికత్వం లొల్లి ఇంటిలోకి తీసుకొచ్చినందుకు నానీతో చీవాట్లు తిన్న కౌశల్‌‌ను వారు అన్ని విషయాల్లో సమర్థించడం, ఈ విషయాలన్నింటిలో నాని ప్రవర్తన చూశాక, వారి మీద, ఈ ఆట మీద నాకు పూర్తి విరక్తి కలిగింది. ఇలాంటి ఆట నాకు అక్కర్లేదని ఇంటిలోనే ప్రకటించేశాను. మమ్మల్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఇంట్లోకి తీసుకొచ్చి, ఈ ఇద్దరిని ఓడిపోయినా ఆర్భాటంగా కాంపెయినింగ్‌ కూడా చేయనిచ్చి తీసుకొస్తే- ఇది అందరినీ సమానంగా చూసే (ఈక్వల్‌) గేమ్‌ ఎలా అవుతుంది?’ అంటూ ఆటలోని అసమంజసత్వాన్ని ప్రశ్నించారు బాబు గోగినేని.
 
బాబు గోగినేనిని బిగ్‌బాస్‌ ఇంటిలో చూసిన మొదటి రోజే అందరూ ఆశ్చర్యపోయారు. ఇటువంటి వ్యక్తి ఆ ఇంటిలో ఇమడగలరా? అనే అనుమానం వచ్చింది. బిగ్‌బాస్‌ ఇంట్లో దేన్నీ ప్రశ్నించకూడదు. అక్కడ న్యాయం, అన్యాయం, హేబద్ధత, సూత్రబద్దత వంటివి ఏమీ వుండవు. బిగ్‌బాస్‌ చెప్పిందే సూత్రం. బిగ్‌బాస్‌ ఆడించిందే ఆట. అటువంటి చోట బాబు గోగినేని 63 రోజులు ఉండటం గొప్ప విషయమే. ఆయన బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లబట్టి… ఆ షోలోని లోపాలు ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. అంతా బాగానే ఉందని బిగ్‌బాస్‌ తన గంభీర స్వరంతో  గదమాయించవచ్చుగానీ… వాస్తవాలను కప్పిపుచ్చడం సాధ్యంకాదు. వచ్చే సీజన్‌ కన్నా ఈ లోపాలను సరిచేసుకుంటే షో ప్రతిష్ట నిలబడుతుంది. లేదంటే... బిగ్ బాస్ ఇంట్లో ప్రతి సభ్యుడికి ఓ సైన్యం వుంటుంది ట్విట్టర్లో...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు