చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల భారత పర్యటన శనివారం ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం చెన్నైకు చేరుకున్న ఆయన... స్థానిక గిండీలోని ఐటీసీ గ్రాండ్ చోళా నక్షత్ర హోటల్‌లో బస చేశారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఆయన... 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురానికి కారులో ప్రయాణం చేశారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో శుక్ర, శనివారాల్లో రెండు దఫాలుగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నంతో ఈ చర్చలు ముగిశాయి. ఆ తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో బీజింగ్‌కు వెళ్లిపోయారు. జిన్‌పింగ్ కాన్వాయ్ వద్దకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లి అతడిని సాగనంపారు.
ఇక ఈ భేటీపై ప్రధాని మోడీ స్పందిస్తూ, చెన్నై సమావేశం ఇరుదేశాల మైత్రిని మరింత బలపర్చిందన్నారు. వూహన్ సమ్మిట్ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య విశ్వాసం మరింత పెరిగిందన్నారు. చెన్నై విజన్‌తో కొత్త శకం ఆరంభమైందన్నారు. చెన్నై, చైనా మధ్య ముందు నుంచే వాణిజ్య సంబంధాలున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇకపోతే భారత్ - చైనా దేశాధినేతల మధ్య జరిగిన చర్చల్లో కాశ్మీర్ అంశమే ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. ఈ విషయంలో పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై తన అక్కసును వెళ్లగక్కింది. అయినప్పటికీ తగిన మద్దతు లభించలేదు. పైగా, తన మిత్రదేశం చైనా కూడా కాశ్మీర్ అంశంలో అండగా నిలబడలేదు. అయితే, భారత్ - చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై మాత్రం చర్చకు వచ్చినట్టు సమాచారం.