జడ్జీలు ఇచ్చే తీర్పులపై విమర్శలు చేయడంతో తప్పు లేదనీ, కానీ, జడ్జీలకు కొన్ని ఉద్దేశ్యాలను అంటగడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, న్యాయవ్యవస్థలోని ఉన్నత పదవులను అందుకోవాలన్న యువత ఆకాంక్షలకు ఇది అడ్డుపడుతుందన్నారు.
కోర్టు హాలులో తాను నిగ్రహంతో ఉంటాననే వ్యాఖ్యలపై రంజన్ గగోయ్ స్పందిస్తూ, ఎవరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ తృప్తిపరచడానికి తాను రాజకీయ నాయకుడినో, దౌత్యవేత్తనో కాదన్నారు. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తానని, ఇది కొందరికి తప్పుగా కనిపిస్తోందన్నారు. ఇదే విషయంపై కొందరు చెత్త వాగుడు వాగితే తాను ఏం చేయగలనని ప్రశ్నించారు.
అదేసమయంలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులపై స్పందన తెలియజేయవచ్చు. విమర్శలు చేయవచ్చన్నారు. తీర్పుల్లోని తప్పులను కూడా ఎత్తి చూపొచ్చన్నారు. కానీ, జడ్జిమెంట్లను ఇచ్చిన జడ్జిలకు కొన్ని ఉద్దేశ్యాలను అంటగడుతూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. జడ్జిలపై బురద చల్లడం వంటివి ఒక ప్రమాదకరమై ట్రెండ్‌గా ఆయన అభిర్ణించారు.
జడ్జిలపై బురద చల్లే ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే... ఎంతో టాలెంట్ ఉన్న యువత జడ్జి వృత్తిని చేపట్టేందుకు ఇష్టపడరు. జడ్జిషిప్ వైపు యువతను ఆకర్షించడం కఠినతరమవుతుందని ఆయన వివరించారు. ఇతర వృత్తుల ద్వారా కావాల్సినంత సంపాదించుకుంటున్నాం... జడ్జిగా బాధ్యతలను చేపట్టి బురద ఎందుకు చల్లించుకోవాలని యువత భావించే అవకాశం లేకపోలేదన్నారు. ఇలాంటి విమర్శలతో తమ కుటుంబాలు కూడా ప్రభావితం అవుతాయని రంజన్ గగోయ్ చెప్పుకొచ్చారు.