సుప్రీంకోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తిరగబడ్డాయి. తమకు పూర్తి మెజార్టీ ఉందనీ, అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కమలనాథులు... సుప్రీం ఆదేశాలతో తోకముడిచారు. మహా బలపరీక్షకు ఒక్కరోజు ముందే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు.
అయితే, ఫడ్నవీస్ రాజీనామా ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోగా బీజేపీ ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాల్సిందిగా సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ చీఫ్ అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు అత్యవసరంగా పీఎం ఛాంబర్‌లోనే అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఈ ముగ్గురు నేతలు సుప్రీంకోర్టు తీర్పుతోపాటు.. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు, బలాబలాలపై విపులంగా చర్చించారు. ఈ చర్చల్లో అజిత్ పవార్ వల్ల ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు అసాధ్యమని తేల్చారు. దీంతో బలం నిరూపించుకోకుండానే తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకుని, ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు తెలియజేశారు.